• కుంకీ ఏనుగుల తొలి ఆపరేషన్ విజయవంతం
• పంటల్ని ధ్వంసం చేస్తున్న ఏనుగుల్ని.. కుంకీలు దారి మళ్లించాయి
• తొలి ఆపరేషన్ విజయవంతం చేసిన అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి అభినందనలు
రాష్ట్రంలో ఆపరేషన్ కుంకీ మొదలయ్యింది. కుంకీ ఏనుగుల ద్వారా చేపట్టిన తొలి ఆపరేషన్ విజయవంతంగా పూర్తి అయిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో సంతోషం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండల పరిధిలోని మొగిలి వద్ద మామిడి తోటలను ధ్వంసం చేస్తున్న అటవీ ఏనుగుల గుంపుని కుంకీలు విజయవంతంగా దారి మళ్లించి అడవిలోకి తరిమికొట్టినట్టు అటవీ శాఖ అధికారులు ఇచ్చిన సమాచారం ద్వారా తెలియవచ్చింది. కృష్ణ, జయంత్, వినాయక అనే కుంకీలు ఆ ఆపరేషన్ లో పాల్గొని అడవి ఏనుగులను పంటల వైపు రాకుండా అడ్డుకుని తిరిగి అడవిలోకి మళ్లించాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కొనసాగిన ఈ ఆపరేషన్ లో కర్ణాటక నుంచి తీసుకువచ్చిన కృష్ణ అనే కుంకీ ఏనుగు చాలా చురుకుగా పాల్గొన్నట్టు అటవీ అధికారులు తెలియజేశారు. మొగిలి ప్రాంతంలో 15 రోజులుగా ఏనుగుల సంచారం ఉన్న సమాచారంతో అధికారులు ఈ ఆపరేషన్ చేపట్టారు. కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను తీసుకువచ్చిన అనంతరం రెండు నెలల శిక్షణ తర్వాత మొదటి ఆపరేషన్ విజయవంతంగా చేపట్టడం ఆనందాన్నిచ్చింది. ఏనుగుల సంచారంతో ఇబ్బందులు పడుతున్న సరిహద్దు ప్రాంతాల రైతులు, ప్రజలకు ఈ ఆపరేషన్ భరోసా ఇస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏనుగుల గుంపు నుంచి పంటలను, ప్రజల ప్రాణాలు కాపాడే దిశగా ప్రణాళికాబద్ధంగా పని చేస్తుంది అనడానికి కుంకీలతో చేపట్టిన ఆపరేషన్ తొలి అడుగు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న అటవీ అధికారులకు, మావటిలు, కావడిలకు అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే అడిగిన వెంటనే కుంకీ ఏనుగులు రాష్ట్రానికి ఇచ్చి సహకరించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకి, ఆ రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే కి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తదుపరి ఆపరేషన్ పుంగనూరు అటవీ ప్రాంతంలో చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

Share this content:
Post Comment