ఉద్యోగులు, ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. ఏపీ కంటే 2 శాతం ఎక్కువ ఫిట్‌మెంట్!

తెలంగాణలోని  ఉద్యోగ, ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి గుడ్ న్యూస్ చెప్పినట్టు తెలుస్తోంది. ఏపీ కంటే రెండు శాతం ఎక్కువగా ఫిట్‌మెంట్ (వేతన సవరణ) అమలు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టు ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్ అధికారుల సంఘాల ప్రతినిధులు తెలిపారు.

ఏపీలో 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) అమల్లో ఉండగా, తెలంగాణలో రెండు శాతం ఎక్కువగా 29 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చేందుకు కేసీఆర్ సూచన ప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది. వేతన కమిషన్ సిఫారసుతో సంబంధం లేకుండా ఫిట్‌మెంట్ అమలు చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం. ఉద్యోగ, ఉపాధ్యాయులకు 7.5 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని వేతన సవరణ కమిషన్ సిఫారసు చేసింది. దీనిపై సంఘాలన్నీ ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో స్పందించిన ప్రభుత్వం కమిషన్ సిఫారసుతో సంబంధం లేకుండా వేతన సవరణ అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

నిన్న ప్రగతి భవన్‌లో మధ్యహ్నం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫిట్‌మెంట్‌పై చర్చ జరగ్గా సీఎం పై హామీ  ఇచ్చినట్టు సంఘాల ప్రతినిధులు తెలిపారు. అంతేకాదు, ఏప్రిల్ 1 నుంచే కొత్త వేతన సవరణ అమల్లోకి వస్తుందని కూడా కేసీఆర్ స్పష్టం చేసినట్టు సమాచారం.

వేతన సవరణతోపాటు ఏపీలోని తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి తెప్పించడం, పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచడంతోపాటు 2003-04 సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలకు పెన్షన్ పథకాన్ని అమలు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్టు ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి.