@20 కీలక మైలురాయిని అధిగమించిన మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 7వ తేదీతో ప్రజా పరిపాలనలో 20వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ప్రపంచ చరిత్రలో వరుసగా 20 ఏళ్ళ పాటు ప్రజా పరిపాలన రంగంలో కొనసాగిన ఏకైక వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కూడా ప్రజా పరిపాలనలో 20 ఏళ్ళు (రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గాను, రెండు విడతలు అమెరికా అధ్యక్షునిగాను) పూర్తి చేసుకున్నప్పటికీ ఆయన మధ్యలో బ్రేక్ తీసుకున్నారు.

బుధవారం ఆయన ప్రభుత్వాధినేతగా 20వ ఏట అడుగుపెట్టారు. ప్రపంచంలో ఎన్నికైన ప్రభుత్వాధినేతగా సుదీర్ఘకాలం పనిచేసిన వారిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకరని కేంద్ర మంత్రి రవిశం​కర్‌ ప్రసాద్‌ ట్వీట్‌ చేశారు. ప్రతి భారతీయుడికి ఇది గర్వకారణమని, భారత్‌తో పాటు ప్రపంచం శాంతి సౌఖ్యాలతో విలసిల్లేలా ఆయన మరింత శక్తిని పొందాలని ఆకాంక్షిస్తున్నామని వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి హోదాలో దీర్ఘకాలం ప్రభుత్వాధినేతగా పనిచేసిన ప్రధాని మోదీని అమెరికా మాజీ అధ్యక్షులు బిల్‌ క్లింటన్‌, జార్జి బుష్‌, ఫ్రాంక్లిన్‌ రూజ్‌వెల్ట్‌, దివంగత బ్రిటన్‌ ప్రధాని మార్గరెట్‌ థాచర్‌ వంటి ప్రపంచ నేతలతో కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ పోల్చారు. ప్రభుత్వాధినేతగా 20వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన నరేంద్ర మోదీకి పలువురు బీజేపీ నేతలు, మంత్రులు ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 2014లో భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టకముందు నరేంద్ర మోదీ 2001 నుంచి 13 ఏళ్ల పాటు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

ఈ సంధర్భంగా కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా మోదీని అభినందించారు. ఈ మేరకు అమిత్ షా బుధవారం ట్విట్టర్‌లో పలు ట్వీట్లను పోస్టు చేశారు. అక్టోబర్ 7వ తేదీ భారత దేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన రోజుగా అమిత్ షా పేర్కొన్నారు. మోదీ సారథ్యం దేశానికి కొత్త దశను, దిశను ఇస్తోందని ఆయన తన ట్వీట్లలో ప్రస్తావించారు.