మరో 3 మెట్రో స్టేషన్లు అందుబాటులోకి..

కొవిడ్‌-19 కారణంగా 8 నెలలుగా మూతబడిన కొవిడ్‌ కంటెయిన్‌మెంట్‌ జోన్‌ పరిధిలో మూసి ఉన్న మెట్రో స్టేషన్లు నేడు పునఃప్రారంభం కానున్నాయి. కొవిడ్‌ తీవ్రత తక్కువగా ఉన్న స్టేషన్లను 2నెలల క్రితం ప్రారంభించి మెట్రో రైళ్లు నడిపిస్తున్న అధికారులు గురువారం నుంచి భరత్‌నగర్‌, ముషీరాబాద్‌, గాంధీ ఆస్పత్రి స్టేషన్లలోనూ ప్రారంభిస్తామని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. సాధారణంగా ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే రైళ్లను ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆరున్నరకే ప్రారంభిస్తున్నారు. ఆయా కారిడార్ల నుంచి రాత్రి 9.30 నిమిషాలకు ప్రారంభమయ్యే చివరి రైలు 10.30కు టెర్మినల్‌ స్టేషన్‌కు చేరుకుంటుందని అధికారులు చెప్పారు. మియాపూర్‌-ఎల్బీనగర్‌, నాగోల్‌-రాయదుర్గం, జేబీఎ్‌స-ఎంజీబీఎస్‌ మార్గాల్లో గతంలో రోజూ 4 లక్షల మందికి పైగా ప్రయాణించేవారు. కొవిడ్‌ కారణంగా ప్రయాణికుల సంఖ్య 1.80-2 లక్షలకు తగ్గింది. దీంతో ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు మెట్రో అధికారులు ఆఫర్లను ప్రతిపాదించారు. మెట్రో రైళ్లలో ప్రయాణించే వారు మాస్కులు ధరించి కొవిడ్‌ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ఉదయం 6.30 గంటలకే

మెట్రో రైళ్లు గురువారం నుంచి ఉదయం పూట 6.30 గంటలకే తొలి మెట్రో ప్రారంభం కానుంది. లాక్‌డౌన్‌ అనంతరం ఈ రైళ్లు పునఃప్రారంభించిన తర్వాత ఉదయం 7 గంటల నుంచి నడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రయాణికుల అభ్యర్థన మేరకు కరోనాకు ముందు మాదిరే ఉదయం 6.30 నుంచి నడపనున్నట్లు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. రాత్రుళ్లు మాత్రం ప్రస్తుతం మాదిరిగానే నాగోల్‌, రాయదుర్గం, మియాపూర్‌, ఎల్బీనగర్‌, జేబీఎస్‌ స్టేషన్ల నుంచి చివరి మెట్రో 9.30 గంటలకే ఉంటుంది. గమ్యస్థానం చేరే సరికి రాత్రి 10.30 కానుంది. ఎల్బీనగర్‌ వెళ్లే చివరి మెట్రో ఖైరతాబాద్‌లో 10 గంటలకు ఉంటుంది. రాత్రుళ్లూ సమయాన్ని పొడిగించాలని ప్రయాణికులు కోరుతున్నారు.