బాలాపూర్ గణేశునికి తొలి రోజు పూజ

కరోనా కారణంగా వినాయక చవితి వేడుకల్లో సందడి లేకుండా పోయింది. గతంలో వినాయకచవితి వస్తుందంటే చాలు.. ఎంతో హడావుడి, భక్తుల కోలాహలం ఉండేది. కానీ ఈసారి అలాంటి సందడి వాతావరణమే ఎక్కడా కనబడలేదు. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో ఖైరతాబాద్‌ మహాగణపతి తర్వాత బాలాపూర్‌ గణనాథుడే ప్రసిద్ధి. అక్కడ జరిగే వేలం పాటపైనే అందరి దృష్టి. కానీ ఈసారి కరోనా వల్ల లడ్డూ వేలం పాట నిర్వహించడంలేదని గణేశ్ ఉత్సవ సమితి స్పష్టం చేసింది. గతేడాది 21 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఈ ఏడాది కొవిడ్ నింబధనలకు అనుగుణంగా ఆరు అడుగుల ఎత్తులో బాలాపూర్‌లో వరసిద్ధి వినాయకున్ని ఏర్పాటు చేశారు.

అయితే బాలాపూర్ గణేశునికి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తొలి రోజు పూజ చేశారు. బాలాపూర్ గణేశున్ని సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. ఈ సందర్బంగా బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. సబితా ఇంద్రారెడ్డితో పాటు మేయర్ చిగురింత పారిజాత, ఉత్సవ సమితి అధ్యక్షులు నరసింహారెడ్డి పూజలో పాల్గొన్నారు. ప్రజలందరిని కరోనా నుండి కాపాడాలని సబితా ఇంద్రారెడ్డి కోరుకున్నారు.