పవనన్న ప్రజాబాట 48వ రోజు

ఆత్మకూరు, పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయాలన్న దృఢ సంకల్పంతో, ప్రజల ఆశీర్వాదంతో కొనసాగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం, ఆదివారం 48వ రోజుకు చేరకుంది. ఈ సందర్భంగా నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఇటీవల చేయించుకున్న ప్రశాంత్ కిశోర్ సర్వేతో పాటు సీఎం జగన్ ప్రత్యేకంగా చేయించుకున్న మరో ప్రైవేట్ సర్వేలోనూ వైసీపీకి వచ్చే ఎన్నికల్లో వచ్చేది 60 సీట్లే అని తేలిందని, ఇవే పరిస్థితులు కొనసాగితే ఆ సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు వెల్లడైందని, దీంతో అసహనంలో ఉన్న సీఎం జగన్ ప్రస్తుత మంత్రులు, ఎమ్మెల్యేల సీట్లకు ఎసరు పెడుతున్నట్లు సమాచారం ఉందని అన్నారు. మంత్రి రోజా ఎమ్మెల్యే సీటుని సీఎం జగన్ చించేశారని దీంతో అభద్రతాభావానికి లోనవుతున్న రోజా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై తప్పుడు ప్రచారానికి పూనుకుంటున్నారని, ఇలాగైనా సీఎం జగన్ ని ప్రసన్నం చేసుకోవాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు తెలుసుకోవాల్సింది ఏంటంటే తమకు ఉన్న అవకాశాలను ఉపయోగించుకుని రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టాలి కానీ ఇలా పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకుంటే ఇప్పుడు వస్తాయనుకుంటున్న 60 సీట్లు కాస్త 30 కంటే తక్కువకు పడిపోతాయని దుయ్యబట్టారు. సీఎం జగన్ రెడ్డి తాను బటన్ నొక్కాను ప్రజలు ఓట్లేసి గెలిపించేస్తారు అనే భ్రమల్లో ఉన్నారని, కానీ క్షేత్రస్థాయిలో ఒక ముఠాగా తయారై ప్రజాభివృద్ధిని గాలికి వదిలేసి ఎప్పుడు తమ గబ్బు నోరు పారేసుకునే ఇటువంటి మంత్రులను, మాజీమంత్రులను, ఎమ్మెల్యేలను పెట్టుకుని ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. ప్రజలకు తామేమి చేశామో చెప్పుకోలేక వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు వస్తుందో రాదోననే అభద్రతాభావంతో పిచ్చిపట్టినట్టు వాగుతున్న మంత్రి రోజా లాంటి వారిని చూస్తుంటే తమకు జాలి కలుగుతోందని అన్నారు. పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని అరుంధతీయ పాలెం, మెయిన్ బజార్, ప్రాంతాలలో పర్యటించి ప్రతి ఇంటికి జనసేన పార్టీ కరపత్రాలను పంచుతూ, జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేస్తూ పవనన్న ప్రజాబాట సాగుతుంది. ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులను తెలుసుకొని జనసేన పార్టీ తరఫున తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ భరోసా ఇవ్వడం జరిగింది. మున్సిపల్ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయని, ముఖ్యంగా డ్రైనేజీ సౌకర్యం, వీధి దీపాల వంటి కనీస సౌకర్యాలకు కూడా నోచుకోలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఈ సందర్భంగా శ్రీధర్ తెలిపారు. సకల సౌకర్యాలతో, ఆత్మకూరు మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలంటే ప్రజలందరూ జనసేన పార్టీకి ఓటు వేసి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు జనసేన పార్టీ నాయకులు వంశీ, సురేంద్ర, చంద్ర, నాగరాజు, శ్రీకాంత్, గణేష్, హరీష్, పవన్, చందు, భాను, సాయి చంద్, హజరత్ తదితరులు పాల్గొన్నారు.