అరకు ఘాట్‌రోడ్డులో బస్సు ప్రమాదం.. 8మంది మృతి

విశాఖ జిల్లా అరకు లోయలో ఘోర ప్రమాదం జరిగింది. ఘాట్‌రోడ్‌ ఐదో నంబరు మలుపు వద్ద టూరిస్ట్ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతిచెందారు. మృతులంతా హైదరాబాద్‌కు చెందిన పర్యాటకులుగా గుర్తించారు. పలువురి టూరిస్టులకు గాయాలయ్యాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఎస్‌.కోట ఆస్పత్రికి తరలించారు.

అరకునుంచి హైదరాబాద్‌ తిరిగివెళుతుండగా ప్రమాదం జరిగింది. బస్సు దూసుకెళ్లిన ప్రాంతంలో చీకటిగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. మృతుల్లో చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డుముకు దాటిన తర్వాత మలుపు వద్ద బస్సు లోయలో పడినట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 38 మంది పర్యాటకులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన బస్సు హైదరాబాద్‌ షేక్‌పేటకు చెందిన దినేష్ ట్రావెల్స్‌దిగా గుర్తించారు.

అరకు లోయ ప్రమాదం ఘటనపై మంత్రి అవంతి శ్రీనివాస్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌ విజయ్‌చంద్‌కు ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.