80 శాతం ప్రజలు జగనన్న స్టిక్కర్లు పీకేశారు: ఆళ్ళ హరి

  • వైసీపీ పాలనలో చెడు జరగని కుటుంబం లేదు
  • గడప గడపలో వైసీపీని ఛీత్కరించారు
  • అది పీఫుల్స్ సర్వే కాదు ఫాల్స్ సర్వే
  • గుంటూరు జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు: అధికార వైకాపా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్నే మా భవిష్యత్, జగనే మా నమ్మకం ప్రచారయాత్ర అట్టర్ ప్లాప్ అయిందని, ప్రజల్ని బెదిరించి అదిరించి గోడలకు అతికించిన స్టిక్కర్లను 80 శాతం మంది ప్రజలు పీకేసారని గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. నాలుగేళ్ళ జగన్ రెడ్డి పాలనను ప్రజలు గడప గడపలో ఛీత్కరించుకున్నారని విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాలంటీర్లతో గృహసారధులతో కలిసి వైసీపీ నేతలు ప్రజలకు ఇష్టం లేకపోయినా స్టిక్కర్లను అంటించటం హేయమన్నారు. ప్రజల కష్టాల్ని, సమస్యల్ని వినకపోగా శాసనసభ్యుడి స్థాయి వ్యక్తులు కూడా బౌతికదాడులకు తెగబడటం వైసీపీ అరాచక పాలనకు పరాకాష్ట అని ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు చేస్తుంది పీపుల్స్ సర్వే కాదని ఫాల్స్ సర్వే అని దుయ్యబట్టారు. మాట్లాడితే ప్రతీ కుటుంబానికి మేలు చేశామని వైసీపీ నేతలు పదే పదే వల్లెవేస్తున్నారని వాస్తవంలో మాత్రం ఏ కుటుంబమూ ఆనందంగా లేదన్నారు. నిరుద్యోగుల, ఉపాధ్యాయుల, ఉద్యోగుల, వ్యాపారుల, సామాన్యుల, రోజువారీ కూలీల కుటుంబాలు వైసీపీ అసమర్ధ పాలనతో చిన్నాభిన్నమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పాలనకు మద్దతుగా మిస్డ్ కాల్ కాకుండా అభిప్రాయ సేకరణ పెడితే వైసీపీ పాలనపై క్షేత్రస్థాయిలో ప్రజాగ్రహం ఏ స్థాయిలో ఉందో తెలిసేదన్నారు. కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం అని చెప్పుకునే వైసీపీ నేతలు సంక్షేమ, అభివృద్ధి పనుల్లో జనసేన, టీడీపీ కార్యకర్తల పట్ల వివక్ష ఎందుకు చూపిస్తున్నారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనపై , దాష్టీకాలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు నెలకొన్నాయన్నారు. వైసీపీ విముక్త ఆంద్రప్రదేశ్ లక్ష్యంగా జనసేన ముందుకు సాగుతుందన్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కు ప్రజలు అండగా నిలవాలని ఆళ్ళ హరి కోరారు.