అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ‘ట్విటర్‌’ ఖాతా లాక్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఖాతాను ట్విటర్‌ లాక్‌ చేసింది. క్యాపిటల్‌ భవనంలోకి ట్రంప్‌ మద్దతుదారులు దూసుకెళ్లి కాల్పులు జరిపిన నేపథ్యంలో ట్విటర్‌ ఖాతా లాక్‌ అవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలో తమ నియమాలకు విరుద్ధంగా చేసిన ట్వీట్లను తొలగించాలని ట్విటర్‌ ట్రంప్‌ను కోరింది. ట్విట్లు తొలిగించకపోతే ట్రంప్‌ ఖాతా లాక్‌ చేసే ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ చేసిన మూడు ట్వీట్లను తొలగించింది.

ఆందోళనకారులు సంయనం పాటించాలంటూ ట్రంప్‌ వీడియో సందేశం విడుదల చేశారు. ఈ వీడియోను ఫేస్‌బుక్‌ తొలగించింది. ట్రంప్‌ మద్దతుదారుల ఆందోళన దృష్ట్యా వీడియో తొలగించామని ఫేస్‌బుక్‌ వెల్లడించింది. ట్విటర్‌, ఫేస్‌బుక్‌లతో పాటు ఇన్‌స్టాగ్రామ్‌ కూడా ట్రంప్‌ పోస్టులను తొలగించింది.

అమెరికా క్యాపిటల్‌ భవనంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఓ మహిళ చనిపోయింది. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణలో ఆమె మెడపై తూటా గాయమైంది. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స పొందుతూ మృతిచెందింది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్‌ గెలుపును ధ్రువీకరించేందుకు యూఎస్‌ కాంగ్రెస్‌ సమావేశమైంది. అయితే బైడెన్‌ ఎన్నికను వ్యతిరేకిస్తూ ట్రంప్‌ మద్దతుదారులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ క్యాపిటల్‌ భవనంలోకి దూసుకొచ్చారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుంటున్నారు.