వాషింగ్టన్‌లో హింసాత్మక చర్యలు బాధ కలిగించాయి: ప్రధాని మోదీ

అమెరికాలోని క్యాపిటల్‌ భవనం వద్ద చోటు చేసుకున్న ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. ‘వాషింగ్టన్‌లో హింసాత్మక చర్యలు బాధ కలిగించాయి. అమెరికాలో అధికార బదిలీ శాంతియుతంగా జరగాలి. నిరసనలతో ప్రజాస్వామ్య ప్రక్రియను ఆటంకపరచడం సరికాదు’ అని మోదీ ట్వీట్‌ చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్‌ గెలుపును ధ్రువీకరించేందుకు వాషింగ్టన్‌ డీసీలోని యూఎస్‌ కాంగ్రెస్‌ క్యాపిటల్‌ భవనంలో సమావేశం కాగా.. ట్రంప్‌ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో భవనం వద్ద పోలీసులు, ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణ హింసాత్మకంగా మారడంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

తిరిగి ప్రారంభమైన ప్రక్రియ.. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్‌ ఎన్నిక ధ్రువీకరణ సమావేశంలో ఉద్రిక్త వాతావారణం నెలకొన్న విషయం తెలిసిందే. సమావేశం జరుగుతున్న క్యాపిటల్‌ భవనంలోకి ట్రంప్‌ మద్దుతుదారులు ప్రవేశించి ఆందోళనకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో కొద్దిసేపు నిలిచిన ఎన్నిక ధ్రువీకరణ సమావేశం తిరిగి ప్రారంభమైంది.