బైడెన్‌ ప్రమాణస్వీకారంరోజే వైట్ హౌస్ ను వీడనున్న ట్రంప్

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్‌ ప్రమాణస్వీకారం రోజే.. ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వైట్ హౌస్ ను వీడనున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి ప్రణాళికలు వేసే ఓ అధికారి పేర్కొన్నారు. బైడెన్‌ ప్రమాణ స్వీకారానికి తాను హాజరుకానని ట్రంప్‌ ఇప్పటికే ప్రకటించారు. అయితే ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్‌ హాజరుకానున్నారు. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ ప్రధాన కార్యాలయం ఉన్న వాషింగ్టన్‌ వెలుపలు ఉన్న బేస్‌ ఆండ్రూస్‌ వద్ద ట్రంప్‌కు వీడ్కోలు పలుకబోతున్నట్లు తెలిపారు. వీడ్కోలు సమయంలో 21-గన్‌ సెల్యూట్‌ చేసే అవకాశం ఉన్నట్లు సంబంధిత అధికారి చెప్పారు. అయితే ప్రణాళికల్లో మార్పులు ఉండవచ్చని చెప్పారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతారా? అనే విషయం స్పష్టంగా తెలియదని, అనంతరం ఆయన ఫ్లోరిడాలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. ప్రారంభోత్సవ దినోత్సవానికి ముందే వైట్‌హౌస్ సమావేశానికి బిడెన్‌కు ఆతిథ్యం ఇవ్వాలని కొందరు సలహాదారులు అధ్యక్షుడిని కోరుతున్నారు. అయితే, ట్రంప్ ఇందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు లేవని పరిపాలన అధికారి తెలిపారు. రెండుసార్లు అభిశంసనకు గురైన ఏకైక అధ్యక్షుడిగా ట్రంప్‌ అమెరికా చరిత్రలో నిలిచారు. అధ్యక్ష పీఠం దిగే ముందుకు మరిన్ని క్షమాభిక్షలు పెట్టాలని నిర్ణయించుకున్నారని, అలాగే తనను తాను క్షమించుకునే అంశాన్ని సైతం పరిశీలిస్తున్నారని సంబంధిత వర్గాలు చెప్పాయి. యూఎస్‌ క్యాపిటల్‌పై ఈ నెల 6న జరిగిన దాడి నేపథ్యంలో ఈ నెల 19న సెనేట్‌ సమావేశం కాబోతోంది. ఈ మేరకు సేనెట్‌ విచారణలో దోషిగా తేలితే అధ్యక్షుడి పీఠం నుంచి తొలగించనున్నారు. భవిష్యత్‌లో పోటీ చేయకుండా ఉండేందుకు ఓటింగ్‌ నిర్వహించనుండగా.. దాని నుంచి ట్రంప్‌ను గట్టెక్కించేందుకు ఆయన మద్దతుదారులు ప్రయత్నిస్తున్నారు.