చిన్నారి లక్షిత మృతి బాధాకరం: డా. పసుపులేటి

  • అయ్యో ‘పాప’
  • నడకదారిలో చిరుత దాడికి బాధ్యులెవరు?
  • టిటిడి గత అనుభవాలను నేర్చుకోవాలి
  • జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

చిత్తూరు: తిరుమల నడక మార్గంలో చిరుత పులి దాడిలో చిన్నారి లక్షిత మృతి చెందడం చాలా బాధాకరమని జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం ఆయన విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో చిన్నారి తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఘటనకు టిటిడినే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. చిన్నారి కనిపించడం లేదని ఆచూకీ కోసం తల్లిదండ్రులు సెక్యురిటీ సిబ్బందికి ఫిర్యాదు చేస్తే వాళ్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. గతంలోనూ ఓ చిన్నారిపై చిరుత దాడి చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. టిటిడి సిబ్బంది సకాలంలో స్పందించి ఉంటే చిన్నారిని బ్రతికించే అవకాశం ఉండేదని ఆయన మండిపడ్డారు. ఈ ఘటనపై టిటిడి ఇవో, ఛైర్మన్ విచారణ జరిపించాలని ఆయన కోరారు. అలాగే తిరుమల నడక మార్గంలో భద్రతను కట్టుదిట్టం చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావ్రుతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అటవీ చట్టాలకు లోబడి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరారు. క్రూర జంతువులు ఇటీవల దాడులు చేస్తుండటంతో భక్తులు భయాందోళనలకు గురవుతున్నారని, భక్తుల్లో భయాన్ని పోగొట్టేలా టిటిడి చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు కూడా సూచనలు చేసేలా మైకుల ద్వారా అప్రమత్తం చేయాలని కోరారు. అలాగే జంతువుల సంచారం ఉండే ప్రాంతాల్లో బోర్డులు పెట్టాలన్నారు. తిరుమలకు నడిచి వెళ్లే భక్తులకు సూచనలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేయడంతో పాటు.. మీడియా, సోషల్ మీడియా ద్వారా విస్త్రుత ప్రచారం చేయాలని సూచించారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపించి భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. చిన్నారి చిరుత దాడిలో మ్రుతి చెందితే.. ఆ ప్రాంతానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి.. చిన్నారి మృతిపై అనుమానాలున్నాయంటూ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. జంతువు దాడిలో చిన్నారి మృతి చెందినట్టు స్పష్టంగా కనిపిస్తున్నా.. రాజకీయంగా ఈ మృతిని వాడుకోవాలనుకోవడం దారుణమని డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మండిపడ్డారు.