శ్రీ కృష్ణ జ్యూట్ మిల్లును తెరిపించాలి.. జనసేన డిమాండ్!

చట్ట ప్రకారం మూసివేసిన శ్రీ కృష్ణ జ్యూట్ మిల్లును తెరిపించాలి.. చట్ట ప్రకారం కార్మికులకు రావాల్సిన రాయితీలు ఇప్పించాలని కోరుతూ.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గం లో వామ పక్షాలు, కార్మిక సంఘాలతో కలిసి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కన్వీనర్ రెడ్డి అప్పల నాయుడు జూట్ మిల్ వద్ద నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ.. గత 20 రోజుల నుండి ఇక్కడే ఉన్న యూనియన్లు అన్ని కూడా పోరాటం చేస్తున్నప్పటికీ జూట్ మిల్ యాజమాన్యం నిష్పక్షపాతంగా మోసపూరితమైన ఆలోచనా ధోరణితో.. అధికార పార్టీకి సంబంధించిన మంత్రి యొక్క చొరవ ఉన్నప్పటికీ కూడా.. మొండికేసిన మేనేజ్మెంట్ మిల్లు తెరిచి కార్మికులకు ఉపాధి కల్పన నిరాకరిస్తూ వస్తున్న తరుణంలో.. ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధర్నాకు అఖిల పక్షంలో ఉన్న అన్ని పార్టీలు కూడా జూట్ కార్మికులకు మద్దతుగా ఉంటాం అని ఒక ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఏదైతే కార్మికుల యొక్క శ్రమతో, వచ్చే లాభాలతో గడించే ఆస్తులు అన్ని కూడా అనేక ప్రాంతాలకు విస్తరిస్తున్నటువంటి పరిస్థితినీ చూస్తున్నాం.. కనీసం కార్మికులకు పట్టెడన్నం పెట్టడానికి కోవిడ్ టైం లో కూడా ఈ మేనేజ్మెంట్ కు మనసు రాలేదు. చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా కోవిడ్ టైం లో కనీస సాలరీ ఇచ్చి.. కార్మికుల బాధ్యత ను తీసుకునే పరిస్థితి చూశాం. కోట్ల రూపాయిలు గడించే ఈ మేనేజ్మెంట్ మాత్రం ఆ వైపుగా ప్రయాణం చేయలేదు సరి కదా.. నేడు అక్రమంగా జూట్ మిల్ ను మూసేసి దానిని రియల్ ఎస్టేట్ గా మార్చేసే ప్రక్రియ చేస్తుంది.

ఈ క్రమంలో నా ఆలోచన ఏంటంటే ఈ ఆస్తి మనది.. ఈ మిల్లును వాళ్ళు తీయకపోతే మనమే తీసుకొని మిల్లును నడిపే కార్యాచరణ కూడా చేయాలి.. లేదంటే ఈ జ్యూట్ మిల్లు మేనేజ్మెంట్ ఇళ్ళను నిర్బంధించి వారి ఇంటి ముందు కూర్చుని అక్కడ అవసరమైన వంటా వార్పూ కార్యక్రమం చేపట్టాలి.

ఇప్పటికైనా కార్మిక శ్రమతో, కార్మిక శక్తితో సంపాదించినటువంటి, అనుభవిస్తున్నటువంటి వారి సుఖాలను గుర్తు తెచ్చుకుని కార్మికుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఇప్పటికైనా.. ఈ మేనేజ్మెంట్ తక్షణమే మిల్లు తెరిచి కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరుతున్నాం.. లేని పక్షంలో ఐక్యసమిటి కార్యాచరణ తీసుకునే నిర్ణయానికి ఏలూరు జనసేన పార్టీ పూర్తిగా మీ ముందుండి మీ కార్యాచరణ లో భాగస్వాములు అవుతామని, నేను కూడా ఒక కార్మికుడిగా, కార్మిక నాయకుడిగా జనసేన పార్టీ ఏలూరు తరపున పూర్తిగా మద్దతు ఇస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, ఐ.ఎఫ్.టి.యూ నాయకులు, ఏ.ఐ.టీ.యూ.సీ నాయకులు, టి.ఎన్.జె.కే.ఎస్ నాయకులు, సీ.ఐ.టీ.యూ నాయకులు, ఐ.ఎన్.టి.యూ.సీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.