ఢిల్లీ ఉద్రిక్తత నేపథ్యంలో షా కీలక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళనల్లో ఒక నిరసనకారుడు మృతిచెందినట్లు సమాచారం. అంతేకాకుండా ఢిల్లీలో పరిస్థితులు అదుపుతప్పడంతో రైతులను నిలవరించేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించడంతోపాటు లాఠిఛార్జ్‌ చేశారు. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలను సైతం బంద్‌ చేశారు. ఈ క్రమంలో ఢిల్లీలో నెలకొన్న తాజా పరిస్థితులపై కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. తాజా పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా మరికాసేపట్లో పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు.

రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన నేపథ్యంలో.. రాజధానిలో ఉదయం నుంచి నెలకొన్న పరిస్థితి, ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు, భద్రత తదితర అంశాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధికారులతో సమీక్షించనున్నారు. హింసాత్మక ఘటనలకు సంబంధించిన సమాచారాన్ని ఆయన తెలుసుకోనున్నారు. హింసాత్మక సంఘటనల నేపథ్యంలో ఢిల్లీలో పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేయడంతోపాటు.. పారామిలిటరీ దళాలను హైఅలెర్ట్‌లో ఉంచాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలిచ్చింది.