బ్లాక్, వైట్ ఫంగస్ లకు తోడుగా ఇప్పుడు ఎల్లో ఫంగస్ పుట్టుకొచ్చింది..

ఓవైపు కరోనా వైరస్ జనాలను బెంబేలెత్తిస్తుంటే.. ఇంకోవైపు బ్లాక్ ఫంగస్ కోరలు చాస్తోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే పలువురు బ్లాక్ ఫంగస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో వైట్ ఫంగస్ కూడా నెమ్మదిగా విస్తరిస్తోంది. ఈ రెండు ఫంగస్ లతో జనాలు సతమతమవుతుంటే.. ఇప్పుడు కొత్తగా ఎల్లో ఫంగస్ పుట్టుకొచ్చింది.

ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో తొలి ఎల్లో ఫంగస్ కేసు నమోదైంది. ఎల్లో ఫంగస్ బారిన పడిన వ్యక్తి ప్రస్తుతం ప్రముఖ ఈఎన్టీ డాక్టర్ బ్రిజ్ పాల్ త్యాగి పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.

మరోవైపు బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కంటే ఎల్లో ఫంగస్ ప్రమాదకరమైనదని వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎల్లో ఫంగస్ కు యాంఫోటెరిసిస్-బీ ఇంజెక్షన్ తో చికిత్స అందించవచ్చని డాక్టర్లు చెప్పారు. ఇది ప్రాణాంతక వ్యాధి అని హెచ్చరించారు.

ఎల్లో వైరస్ లక్షణాలు: బరువు తగ్గడం, నీరసం, ఆకలి మందగించడం లేక పూర్తిగా ఆకలి కాకపోవడం. చీము కారే లక్షణం కూడా ఉంటుందని వైద్యులు చెప్పుతున్నారు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్లను సంప్రదించి చికిత్స తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పరిశుభ్రత లేని వారు ఈ ఫంగస్ కు గురయ్యే అవకాశం ఉంది.