చంద్రబాబు పట్ల వ్యవహరిస్తున్న తీరు సరికాదు: గురాన అయ్యలు

విజయనగరం: పాలనాపరంగా ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలకు గురువారం జనసేన పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా గురాన అయ్యలు మాట్లాడుతూ చంద్రబాబును అరెస్టు చేసిన తీరును సంపూర్ణంగా జనసేన పార్టీ తరుపున ఖండిస్తున్నామన్నారు. ఈ అరెస్టు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యగానే భావిస్తున్నాం అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో జగన్‌ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. విజయనగరంలో జగన్ పర్యటనను బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే శాంతిభద్రతలు దారుణంగా తయారయ్యాయని అన్నారు. పార్టీ అధినేత అరెస్టయితే వాళ్ల పార్టీ నేతలు, కార్యకర్తలు, కేడర్ మద్దతుగా రావడం సహజంగా జరిగే పనేనని… నాయకుడి కోసం అందరూ వస్తారని, ప్రజాస్వామ్యంలో ఇది భాగమన్నారు. ఇళ్ల నుంచి వాళ్లు బయటకు రాకూడదు, రోడ్ల మీదకు రాకూడదు అనుకుంటే ఎలా? అని ప్రశ్నించారు. శాంతియుతంగా చేస్తున్న నిరసన కార్యక్రమాలను అడ్డుకోవడం దారుణమన్నారు. ప్రజల సమస్యల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే. సమాధానం చెప్పలేని వైకాపా నేతలు పవన్ మూడు పెళ్లిళ్లగురించే ప్రతిసారీ మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. పవన్ విడాకులు తీసుకొని మూడు పెళ్లిళ్లు చేసుకుంటే జగన్ కి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు ద‌త్తపుత్రుడు అంటే ఊరుకునేది లేద‌ని హెచ్చ‌రించారు. ఎన్నికల్లో గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతానని చెప్పిన సీఎం జగన్‌ కేసులకు భయపడి ప్రధాని మోదీకి లొంగిపోయారని విమర్శించారు.
సీఎం స్థాయిని మరిచి జగన్ దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయపరంగా ఎన్ని విమర్శలైనా చేయొచ్చని, కానీ తరచుగా వ్యక్తిగత విమర్శలు, దూషణలు చేయడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం సరికాదని హితవు పలికారు. ప్రతిపక్ష నేతలపై నిందలు వేయడం ఏంటని మండిపడ్డారు. రాజకీయంగా విమర్శించేందుకు ఏమీ లేనందునే పవన్ పై వ్యక్తిగత విమర్శలకు జగన్, వైసీపీ మంత్రులు, నేతలు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డి.రామచంద్రరాజు, కాటం అశ్వని, మాతా గాయిత్రి, పుష్ప, లక్ష్మీ, జ్యోతి, చక్రవర్తి, ఎల్. రవితేజ, పిడుగు సతీష్, రవీంద్ర, నారాయణరాజు, అడబాల వేంకటేష్, ఎమ్ పవన్ కుమార్, వజ్రపు నవీన్ కుమార్, పృథ్వీ భార్గవ్, సయిద్ బొకారి, సాయి, దుర్గారావు, సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.