రెండో టెస్టుకు స్టార్‌ పేసర్‌ దూరం

భారత్‌తో రెండో టెస్టుకు ఇంగ్లాండ్‌ సీనియర్‌ ఫాస్ట్‌బౌలర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ విశ్రాంతి తీసుకునే అవకాశం ఉన్నది. తొలి టెస్టు మ్యాచ్‌ ఫలితంతో సంబంధం లేకుండా ఇంగ్లాండ్‌ తమ రొటేషన్‌ పాలసీకి కట్టుబడి ఉండే అవకాశం ఉండటంతో 38ఏండ్ల లెజండరీ పేసర్‌ స్థానంలో మరో స్పీడ్‌స్టర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ జట్టులోకి రానున్నాడు.

‘ఆండర్సన్‌ను వదులుకోవడం చాలా కష్టమైన నిర్ణయం. అతడు అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. ఏం జరుగుతుందో వేచి చూడాలి. విన్నింగ్‌ టీమ్‌ను మార్చడానికి నేనైతే ఇష్టపడను’ అని ఇంగ్లాండ్‌ ప్రధాన కోచ్‌ క్రిస్‌ సిల్వర్‌వుడ్‌ చెప్పాడు.

రొటేషన్‌ పద్దతిలో ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడం వల్ల తర్వాతి మ్యాచ్‌కు ఉత్సాహంగా బరిలోకి దిగే అవకాశం ఉంటుందని ఇంగ్లాండ్‌ భావిస్తున్నది. స్టువర్ట్‌ బ్రాడ్‌ శ్రీలంతో తొలి టెస్టు ఆడాడు. అతని స్థానంలో ఆండర్సన్‌ గాలెలో రెండో టెస్టులో బరిలో దిగాడు. లంకతో టెస్టు సిరీస్‌ను ఇంగ్లాండ్‌ 2-0తో కైవసం చేసుకున్నది. శనివారం నుంచి భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య చెన్నై వేదికగా రెండో టెస్టు జరగనుంది.