విశ్వాస పరీక్షకు ముందు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్‌బై ..

పుదుచ్చేరి : పుదుచ్చేరిలోని నారాయణస్వామి ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కాంగ్రెస్‌ బలం 12కు పడిపోయింది. కాగా, నారాయణ స్వామి ప్రభుత్వం నేడు అసెంబ్లీలో విశ్వాసపరీక్షను ఎదుర్కోనుంది. కాంగ్రెస్‌కు చెందిన కె. లక్ష్మీనారాయణన్‌, డిఎంకె ఎమ్మెల్యే కె. వెంకటేశన్‌లు రాజీనామాలు సమర్పించారు. లక్ష్మీ నారాయణన్‌ సిఎం పార్లమెంటరీ కార్యదర్శి కూడా వ్యవహరిస్తున్నారు. గతంలో ఒక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. మరో ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలు సమర్పించారు. దీంతో వారి సంఖ్య ఆరుకి చేరింది. దీంతో అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 26కి చేరింది. కాంగ్రెస్‌ (9), డిఎంకె (2), స్వతంత్య్ర అభ్యర్థి ఒకరు మొత్తం అధికార పార్టీకి 12 మంది ఎమ్మెల్యేలు మిగిలారు. విశ్వాసపరీక్షలో ఇరుపార్టీల మధ్య టై అయినపుడే స్పీకర్‌ ఓటు వేస్తారు. కాగా, ప్రతిపక్షంలో ఎఐఎన్‌ఆర్‌సి (7), అన్నాడిఎంకె(4), బిజెపి(3) ఎమ్మెల్యేలు ఉన్నారు.