మద్దతు కోసం ఐదు రాష్ట్రాల్లో రాకేశ్‌ తికాయిత్‌ పర్యటన

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనను కొనసాగిస్తున్న భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ తికాయిత్‌ ఐదు రాష్ట్రాల్లో పర్యటిస్తారని యూనియన్‌ ఆఫీస్‌ బేరర్‌ తెలిపారు. మార్చి ఒకటో తేదీ నుంచి ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణలో రైతులతో సమావేశమవుతారని పేర్కొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్‌లోనూ రెండు సమావేశాలు నిర్వహిస్తారని బీకేయూ మీడియా ఇన్‌చార్జి ధర్మేంద్ర మాలిక్‌ తెలిపారు. రాజస్థాన్‌లో రెండు, మధ్యప్రదేశ్‌లో మూడు సమావేశాలు జరుగుతాయని, చివరి మూడు సమావేశాలు మార్చి 20, 21, 22 తేదీల్లో కర్ణాటకలో జరుగుతాయని పేర్కొన్నారు. మార్చి 6న తెలంగాణలో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

అయితే ఎన్నికల కారణంగా ఇంకా అనుమతి రాలేదని, వస్తే షెడ్యూల్‌ ప్రకారం జరుగుతుందని చెప్పారు. గతేడాది సెప్టెంబర్‌లో అమలులోకి వచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) హామీకి కొత్త చట్టం రూపొందించాలని డిమాండ్‌ చేస్తూ నవంబర్‌ నుంచి వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోని సింగు, తిక్రీ, ఖాజీపూర్‌ వద్ద ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఖాజీపూర్‌లో నిర్వహిస్తున్న ఆందోళనకు రాకేశ్‌ తికాయిత్‌ నాయకత్వం వహిస్తున్నారు. చట్టాలపై కేంద్రం, రైతు సంఘాలతో 11 రౌండ్లలో చర్చలు జరిపింది. చట్టాలను రద్దు చేయాలని రైతులు, వెనక్కి తీసుకునేది లేదని ప్రభుత్వం చెప్పడంతో చర్చలు కొలిక్కి రావడంలేదు.