క్యూబాపై విధానం మారదు: బైడెన్

వాషింగ్టన్‌: ఆరు దశాబ్దాలుగా క్యూబాపై విధించిన దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో ఆ ఆంక్షలను సమీక్షిస్తామని బైడెన్‌ ప్రభుత్వం హామీ ఇచ్చింది. క్యూబా పట్ల అమెరికా విధానంలో మార్పు విషయానికొచ్చేసరికి ప్రస్తుతం అది అంత ప్రాధాన్యత కాదని దాటవేసింది. వైట్‌ హౌస్‌ ప్రతినిధి జెన్‌ సాకి ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ‘మన అమెరికా విధానంలో మానవ హక్కులను మూల స్తంభంగా నిలిపేందుకు మేం కట్టుబడి వున్నామని’ అన్నారు. తీవ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాల జాబితాలోకి క్యూబాను చేరుస్తూ ట్రంప్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పాటు ఆంక్షలను సమీక్షించడానికి కట్టుబడి వున్నామని ఆమె చెప్పారు. క్యూబాపై ట్రంప్‌ విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని కోరుతూ 80మంది డెమొక్రటిక్‌ సెనెటర్లు గత వారం కోరారు. ఈ మేరకు వారు ఒక లేఖ రాస్తూ, క్యూబాతో సాధారణ సంబంధాల పునరుద్ధరణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆ లేఖలో వారు సూచించారు. క్యూబా ప్రభుత్వంతో నేరుగా దౌత్య సంబంధాలను తిరిగి ప్రారంభించాలని కోరారు. ఇరు దేశాల్లోని ఎంబసీలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.