అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ ప్రమాణం

భద్రతా బలగాల పటిష్ట పహారా మధ్య బుధవారం అమెరికా 46వ అధ్యక్షుడిగా జోసెఫ్‌ రాబినెట్‌ బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. క్యాపిటల్‌ భవనంలో సంప్రదాయంగా ప్రమాణ స్వీకారం జరిగే ప్రదేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌.. బైడెన్‌తో దేశ నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేయించారు. తమ కుటుంబానికి చెందిన 127 ఏళ్లనాటి బైబిల్‌పై ప్రమాణం చేసి బైడెన్‌ దేశాధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. గతంలో సెనేటర్‌గా, ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా ఆయన ఈ బైబిల్‌పైనే ప్రమాణం చేయడం విశేషం. అధ్యక్షుడుగా బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు, దేశ 49వ ఉపాధ్యక్షురాలిగా మన తమిళనాడు మూలాలున్న ఇండో–ఆఫ్రో అమెరికన్‌ మహిళ కమల హ్యారిస్‌(56) ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో సుప్రీంకోర్టు న్యాయమూర్తి సోనియా సోటోమేయర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు.