ఫోర్త్ టీ20లో ఇంగ్లాండ్‌పై ఇండియా థ్రిల్లింగ్ విక్టరీ

డూ ఆర్‌ డై అన్నట్లు జరిగిన నిర్ణయాత్మక నాలుగో టీ20లో భారత్‌ అద్భుత విజయాన్ని సాధించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సమిష్టి కృషితో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్‌ను ఎనిమిది పరుగుల తేడాతో ఓడించి సిరీస్‌పై ఆశలను సజీవం చేసింది. ఇక టీమిండియా బౌలర్ల దాటికి ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ వరుసగా పెవిలియన్‌ దారిపట్టారు. దీంతో ఆఖరి సమరానికి కాలు దువ్వింది. 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ను 177/8కి పరిమితం చేసింది.

ఈ క్రమంలో భారత బౌలర్లు శార్దూల్‌ ఠాకూర్‌ 3 వికెట్లతో ఇంగ్లాండ్‌ను దెబ్బకొట్టాడు. ఇక రాహుల్‌ చాహర్‌, హార్ధిక్‌ చెరో రెండు వికెట్లు, భువనేశ్వర్‌ ఒక వికెట్‌తో రాణించడంతో టీమిండియా విజయ తీరాలను చేరుకుంది. ఇక అంతకు ముందు టాస్‌ ఓడిన కోహ్లిసేన.. ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగింది. సూర్యకుమార్‌ కేవలం 31 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు సాధించి జట్టు స్కోరును పరిగెత్తించాడు. రాహుల్‌తో కలిసి రెండో వికెట్‌కు 42 పరుగుల కీలక భాగస్వామ్యం అందించాడు. ఇక వరుసగా విఫలమవుతూ వచ్చిన రాహుల్‌ నాలుగో మ్యాచ్‌లోనూ చెప్పుకోదగ్గ ఆటతీరును ప్రదర్శించలేదనే చెప్పాలి. ఇక కోహ్లీ కూడా రషీద్‌ బౌలింగ్‌లో కేవలం 1 పరుగుకే స్టంప్‌అవుట్‌గా వెనుతిరిగాడు. ఇక భారత జట్టు స్కోరును పెంచడంలో రిషభ్‌ పంత్‌ కూడా కీలక పాత్ర పోషించాడు. 23 బంతుల్లో 30 పరుగులు సాధించి మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ అత్యధికంగా 4 వికెట్లు తీశాడు. దీంతో చాలా కీలకమైన నాలుగో టీ20లో భారత్‌ విజయం సాధించింది. 5 మ్యాచ్‌ల సరీస్‌ 2-2తో సమం అయింది. దీంతో చివరి టీ20 మ్యాచ్‌ ఇరు జట్లకు కీలకంగా మారనుంది. ఈ నెల 20న భారత్‌- ఇంగ్లండ్‌ల మధ్య చివరి టీ20 మ్యాచ్‌ జరగనున్న విషయం తెలిసిందే.