తిరుపతి పార్లమెంట్ ఎన్నికలు: దూకుడు పెంచిన టీడీపీ

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక ఏప్రిల్ 17 వ తేదీన జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. మార్చి 30 వ తేదీ వరకు నామినేషన్లు ఉంటాయి. టీడీపీ ఇప్పటికే అధికారికంగా అభ్యర్థిని ప్రకటించింది. పనబాక లక్ష్మి బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తిరుపతి నియోజక వర్గంలో టీడీపీ ప్రచారం నిర్వహిస్తోంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న టీడీపీ ఎలాగైనా తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో సత్తా చాటి తన బలాన్ని నిరూపించుకోవాలని చూస్తున్నది. తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఇప్పటికే టీడీపీ నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి ఏ స్థాయిలో కుంటుపడిందో నేతలు ప్రచారం చేస్తున్నారు. 21 నెలల కాలంలో రాష్ట్రంలో ఎలాంటి పాలన జరుగుతున్నదో తమ ప్రచారంలో బలంగా చెప్తున్నారు నేతలు. ఇక ఇదిలా ఉంటె, వైసీపీ, బీజేపీలు తమ అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉన్నది. తిరుపతి ఉపఎన్నికల్లో గెలిస్తే, రాష్ట్రానికి కేంద్రమంత్రి పదవి లభిస్తుందని, తద్వారా కొంతమేర అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగంగా ఉంటుందని బీజేపీ నేతలు చెప్తున్నారు. తిరుపతి ఉపఎన్నికల్లో మాజీ ఐఏఎస్ లేదా ఐపీఎస్ ని బరిలోకి దించేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తున్నది. అందరికంటే ముందుగా అభ్యర్థిని ప్రకటించిన టీడీపీ, ఆ దిశగానే దూకుడుగా ప్రచారం నిర్వహిస్తూ దూసుకుపోతున్నది.