తిరుపతి బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ

తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న రెండు ఉప ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. తిరుపతి లోక్‌సభ స్థానంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు దృష్టి సారించాయి. తాజాగా బీజేపీ పార్టీ అభ్యర్ధిగా మాజీ ఐఏఎస్ అధికారిణి రంగంలో దిగనున్నారు.

ఏపీలో తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. ఏప్రిల్ 17న న జరగనున్న ఉపఎన్నికకు అధికార, ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. మెజార్టీ ఎంత ఉండాలనేదానిపై అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ దృష్టి సారిస్తుంటే..ఎలాగైనా అధికారపార్టీ అభ్యర్ధిని ఓడించి పాగా వేయాలని ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన బల్లి దుర్గాప్రసాద్ రావు ఆకస్మిక మరణంతో తిరుపతి ఉపఎన్నిక అనివార్యమైంది. వైసీపీ అభ్యర్దిగా డాక్టర్ గురుమూర్తి ని బరిలో దిగుతుండగా, తెలుగుదేశం అభ్రర్ధిగా మాజీ మంత్రి పనబాక లక్ష్మి పోటీ చేస్తున్నారు. తాజాగా బీజేపీ తమ అభ్యర్ధిని ప్రకటించింది.

తిరుపతి లోక్‌సభ అభ్యర్ధిగా మాజీ ఐఏఎస్ అధికారిణి , కర్నాటక మాజీ ఛీఫ్ సెక్రటిరీ రత్నప్రభను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటించారు. బీజేపీ అభ్యర్ధిగా రత్నప్రభ ను ప్రకటించడంతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు శుభాకాంక్షలు అందించారు. కర్నాటక ప్రభుత్వ సీఎస్ గా పనిచేసిన రత్నప్రభ ప్రజలకు చాలా సేవ చేశారని చెప్పారు. ఆమె పరిపాలనా అనుభవం తిరుపతి అభివృద్ధికి ఉపయోగపడుతుందని చెప్పారు. తిరుపతి లోక్‌సభ స్థానం కోసం పొత్తులో భాగంగా తమకు కేటాయిచాలని జనసేన కోరినా..బీజేపీనే దక్కించుకుంది.