*హృదయ పూర్వకంగా అభినందించిన వి.సి,రిజిష్ట్రార్ తదితరులు
ఆంధ్ర కేసరి యూనివర్సిటీ కొత్తగా ఏర్పడిన విశ్వ విద్యాలయం అయినప్పటికీ ‘మట్టిలో మాణిక్యాలకు’ నిలయమని మరోసారి నిరూపించు కోవడం జరిగింది. గతంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగానికి చెందిన ఇద్దరు విద్యార్థులు అఖిల భారత స్థాయిలో బంగారు, రజత పతకాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. గురువారం ఆక్వా కల్చర్ విభాగానికి చెందిన విద్యార్థులు నూటికి నూరు శాతం క్యాంపస్ సెలక్షన్స్ (ప్రాంగణ ఎంపికలు) ద్వారా ఉద్యోగాలు పొండడంలో సఫళీకృతులయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్ర కేసరి విశ్వ విద్యాలయం నందు 2023 – 25 బ్యాచ్ నందు ఆక్వా కల్చర్ విభాగంలో చేరిన 9 మంది విద్యార్థులకు ఆంధ్ర కేసరి యూనివర్సిటీ ప్రాంగణంలో గతంలో నెల్లూరుకు చెందిన ఆల్ఫా మెరైన్ కంపెనీ, భీమవరంకు చెందిన రాయల్ మెరైన్ కంపెనీ వంటి రొయ్యల ఉత్పత్తి కంపెనీలు ప్రాంగణ ఎంపికలను నిర్వహించడం జరిగింది. ఈ ఎంపికలో నెల్లూరు లోని ఆల్ఫా మెరైన్ కంపెనీకి సుమారు 3 లక్షల రూపాయల వార్షిక వేతనం(బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ కలిపి)తో ప్రసన్న రాణి, తేజస్విని, మహి, పావని, రత్న కుమారి, జాస్మిన్, శివ కుమార్, దేవ వర ప్రసాద్ లు ఎంపికయ్యారు. రంజిత్ బాబు అనే విద్యార్థి భీమవరం లోని రాయల్ మెరైన్ కంపెనీ తరుపున ఉద్యోగానికి ఎంపిక కావడం జరిగింది. గురువారం సాయంత్రం ఆంధ్ర కేసరి యూనివర్సిటీ ప్రాంగణంలోని విసి ఛాంబర్ నందు జరిగిన కార్యక్రమంలో నూరు శాతం ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు విసి ప్రొఫెసర్ డి.వి.ఆర్. మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హరిబాబు, ఆల్ఫా మెరైన్ కంపెనీ, ఎం.డి. సుధాకర్, హెచ్.ఆర్. హెడ్ హెచ్. సాయి ప్రసాద్ తదితరుల చేతుల మీదుగా ఎంపిక పత్రాలను లాంచనంగా అంద జేశారు. ప్రాంగణ ఎంపిక ద్వారా ఉద్యోగాలు పొందిన ఆంధ్ర కేసరి యూనివర్సిటీకి చెందిన మొదటి బ్యాచ్ లోని 9 మంది విద్యార్థులను ఆంధ్ర కేసరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి.వి.ఆర్.మూర్తి, రిజిష్ట్రార్ ప్రొఫెసర్ బి. హరిబాబు, ఏ.కే.యూ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్. నిర్మలా మణి, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. సోమ శేఖర, పూర్వపు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. రాజ మోహన్ రావు, ఆక్వా కల్చర్ విభాగం అధ్యాపకులు డాక్టర్ బి. సురేష్, డాక్టర్ అశ్వర్ధ నారాయణలతో పాటు బోధన, బోధనేతర సిబ్బంది హృదయ పూర్వకంగా అభినందనలు తెలిపారు.

Share this content:
Post Comment