నేటి నుంచి టీకా మహోత్సవ్

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్‌ పంపిణీని వేగవంతం చేయడంలో భాగంగా దేశవ్యాప్తంగా చేపట్టిన టీకా మహోత్సవ్‌ నేడు ప్రారంభంకానుంది. ఇవాళ్టి నుంచి నాలుగు రోజులపాటు ఈ కార్యక్రమం పెద్దఎత్తున కొనసాగనుంది. ఇందులో భాగంగా అర్హులలో సాధ్యమైనంత ఎక్కువ మందికి టీకా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో 45 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరికి వ్యాక్సిన్‌ అందించనున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తిని ఒక్క టీకాతోనే అడ్డుకోగలమని, దీనికోసం రాష్ట్రాల్లో టీకా పంపిణీని ముమ్మరం చేయాలని కేంద్రప్రభుత్వం భావిస్తున్నది.

కాగా, వ్యాక్సినేషన్‌లో భారత్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. టీకా పంపిణిలో అగ్రరాజ్యం అమెరికాను భారత్ అధిగమించింది. కేవలం 85 రోజుల్లోనే దేశంలో పది కోట్ల మందికి కొవిడ్ టీకాలు ఇచ్చామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. అమెరికాలో టీకాలు ఇవ్వడం ప్రారంభించిన 85 రోజుల్లో కేవలం 9.2 కోట్ల మందికి, చైనాలో 6.1 కోట్ల మందికి మాత్రమే టీకా ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు.