చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సుశీల్ చంద్ర

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా (సీఈసీ) సుశీల్‌ చంద్ర ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. 24వ సీఈసీగా ఆయన విధులు నిర్వర్తించనున్నారు. సుశీల్ చంద్రను సీఈసీగా నియమిస్తూ సోమవారం కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత సీఈసీ సునీల్‌ అరోరా సోమవారం పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘంలో అత్యంత సీనియర్‌ కమిషనర్‌గా ఉన్న సుశీల్‌చంద్రను నూతన సీఈసీగా కేంద్రం నియమించింది. 2022 మే 14 వరకు సీఈసీగా సుశీల్ చంద్ర పదవిలో కొనసాగుతారు.

ఎన్నికల సంఘంలో అత్యంత సీనియర్‌ కమిషనర్‌ను సీఈసీగా నియమించడం ఆనవాయితీగా వస్తున్నది. సుశీల్‌ చంద్ర సారథ్యంలో గోవా,మణిపూర్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. గోవా, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌ రాష్ర్టాల అసెంబ్లీల గడువు వచ్చే ఏడాది మార్చితో ముగియనుండగా, యూపీ శాసనసభ గడువు వచ్చే ఏడాది మేతో ముగియనున్నది. ఎన్నికల కమిషనర్‌గా నియమితులు కాకమునుపు సీబీడీటీ చైర్మన్‌గా ఆయన వ్యవహరించారు.