క‌రోనా నుంచి కోలుకున్న వారికి ఒక్క డోసు వ్యాక్సిన్ చాలు!

ఇప్పటికే మీరు కరోనా బారిన పడి కోలుకున్నారా? అయితే మీకు కరోనా వ్యాక్సిన్ ఒక్క డోసు చాలని చెబుతోంది తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనం. గతేడాది డిసెంబర్‌లో వ్యాక్సిన్‌లు మార్కెట్‌లోకి వస్తున్న సమయంలో లాస్ ఏంజిల్స్‌లోని సెడార్స్‌-సినాయ్ మెడికల్ సెంటర్‌లో ప్రారంభమైన ఈ అధ్యయనం.. తాజాగా కొన్ని ఆసక్తికరమైన ఫలితాలను వెలువరించింది. ఈ అధ్యయనంలో మొత్తం 1000 మంది పాల్గొన్నారు. అందులో ఇప్పటికే కరోనా వచ్చి తగ్గిపోయిన వాళ్లు, ఇప్పటి వరకూ ఆ వైరస్ బారిన పడని వాళ్లూ ఉన్నారు.

వీళ్లలో కరోనా వచ్చిన తగ్గిపోయిన వాళ్లకు ఒక్క డోసు టీకా ఇవ్వగానే వాళ్ల రోగనిరోధక శక్తి చాలా మెరుగైనట్లు గుర్తించారు. వైరస్ బారిన పడని వాళ్లకు రెండు డోసులు ఇచ్చినా ఇంత మార్పులో వాళ్లలో గుర్తించలేదని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన సుసాన్ చెంగ్ వెల్లడించారు. ఇలాంటి ఫలితాలు వస్తాయని తాము ఊహించలేదని చెంగ్ చెప్పారు. ఈ అధ్యయన ఫలితాలను న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించారు.

ప్రస్తుతం వ్యాక్సిన్ కొరత ప్రపంచాన్ని వేధిస్తున్న వేళ ఈ అధ్యయన ఫలితాలు ఎంతగానో ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటికే కరోనా బారిన పడి కోలుకున్న వారికి కేవలం ఒక డోసు మాత్రమే ఇవ్వడం వల్ల ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల డోసుల వ్యాక్సిన్‌లు మిగిలిపోనున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ స్కూల్ ఆప్ మెడిసిన్ అధ్యయనం బృందం వెల్లడించింది.

కరోనా నుంచి కోలుకున్న వారి రోగ నిరోధక వ్యవస్థ వైరస్‌ను గుర్తు పెట్టుకుంటుందని, అలాంటి వారికి ఒక్క డోసు ఇచ్చినా అది మెరుగ్గా పని చేస్తున్నట్లు గుర్తించారు. నిజానికి గత ఫిబ్రవరి నుంచే ఫ్రాన్స్‌, స్పెయిన్‌, ఇటలీ, జర్మనీలాంటి యురోపియన్ దేశాలు కరోనా బారిన పడి కోలుకున్న వాళ్లకు రెండు డోసుల వ్యాక్సిన్‌లో కేవలం ఒక డోసే ఇస్తున్నాయి. ఇజ్రాయెల్‌లో అయితే మొదట్లో ఇలాంటి వారికి అసలు వ్యాక్సిన్ అవసరం లేదనుకున్నా.. తర్వాత ఒక్క డోసు చాలని తేల్చారు.