MP సర్కార్ కీలక నిర్ణయం.. అనాథలైన పిల్లలకు రూ. 5000 కరోనా పెన్షన్

భోపాల్‌: కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులను ఆదుకునేందుకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ముందుకొచ్చింది. అలాంటి పిల్లలకు నెలనెలా పింఛనుతో పాటు ఉచిత విద్యను అందించేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ గురువారం వెల్లడించారు.

”కొవిడ్‌ కారణంగా తల్లిదండ్రులు లేదా సంరక్షకులను కోల్పోయిన చిన్నారులకు ప్రతినెలా రూ. 5000 పింఛను ఇవ్వాలని నిర్ణయించాం. అంతేగాక, ఆ పిల్లలకు ఉచిత విద్యతో పాటు వారి కుటుంబాలకు ఉచితంగా రేషన్‌ అందిస్తాం” అని సీఎం చౌహన్‌ తెలిపారు. అంతేగాక, కొవిడ్‌తో కుటుంబ సభ్యులను కోల్పోయిన కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడం కోసం వారికి ప్రభుత్వ హామీపై రుణాలు కూడా ఇవ్వనున్నామని ఆయన పేర్కొన్నారు.

మధ్యప్రదేశ్‌లో కరోనా ఉద్థృతి కారణంగా ఎంతో మంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలవుతున్నారు. అక్కడ ఇప్పటి వరకు 7లక్షల మందికి కరోనా సోకగా.. 6,679 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజే 84 మంది చనిపోయారు. కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం పలు నగరాల్లో కర్ఫ్యూ అమలు చేస్తోంది.