ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి.. రూ.1900 కోట్లు విడుదల

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం-కిసాన్‌) కింద ఎనిమిదో విడత పెట్టుబడి సాయాన్ని ప్రధాని నరేంద్రమోదీ విడుదల చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని రూ.1900 కోట్ల సాయాన్ని అందించారు. దేశ వ్యాప్తంగా 9.5 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తం జమ కానుంది. ఇంతకు ముందు ఏడు విడతల్లో నిధులు విడుదల చేసినప్పటికీ.. అత్యధికంగా ఈసారి రూ.1900 కోట్లు విడుదల చేయడం గమనార్హం.

రైతులను ప్రోత్సహించేందుకే కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. సేంద్రీయ వ్యవసాయం దిశగా రైతులు అడుగు వేయాలని ఆకాంక్షించారు. ఇలా చేయడం వల్ల నేల సారవంతమవుతుందని, సేంద్రీయ వ్యవసాయం ద్వారా వచ్చే ఉత్పత్తులు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయని అన్నారు. ఈ సందర్భంగా కొద్ది మంది లబ్ధిదారులతో ప్రధాని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ రైతు బంజరు భూమిని సేంద్రీయ వ్యవసాయానికి అనువుగా మార్చుకొని పంటలు పండిస్తున్నానని ప్రధానితో చెప్పారు. దీనిపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. మిగతావారందరికీ ఓ మార్గదర్శిగా నిలిచావని కితాబిచ్చారు.

రైతులు వేసే పంటలకు పెట్టుబడి సాయం నిమిత్తం 2019లో కేంద్రం పీఎం-కిసాన్‌ పథకాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ. 6000 పెట్టుబడి సాయాన్ని మూడు వాయిదాల్లో అందిస్తోంది. ప్రతి నాలుగు నెలలకోసారి రూ. 2వేల చొప్పున ఈ సాయాన్ని ఇస్తోంది. ఈ మొత్తం నేరుగా రైతుల ఖాతాల్లోకే బదిలీ చేస్తోంది. కిసాన్‌ సమ్మాన్‌ ద్వారా ఇప్పటివరకు రూ. 1.15 లక్షల కోట్లను అన్నదాతలకు అందించింది.