మార్కెట్లోకి 2డీజీ పౌడ‌ర్‌.. ధ‌ర రూ.990

న్యూఢిల్లీ: రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబోరేటరీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన 2-డీఆక్సీ-డీ-గ్లూకోజ్‌ (2-డీజీ) ఔషధం ధరను ఫిక్స్ చేశారు. 2డీజీ పౌడర్‌ను రూ.990కు అమ్మనున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ హాస్పిటళ్లకు మాత్రం డిస్కౌంట్ ధరలో 2డీజీ ఔషధాన్ని అందివ్వనున్నట్లు చెప్పారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌, ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ కొన్ని రోజుల క్రితం ఈ పౌడర్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అత్యవసర వినియోగం కోసం డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) ఇటీవలే ఈ 2డీజీ ఔషధానికి అనుమతినిచ్చింది.

2-డీజీ పౌడర్‌ రూపంలో ఉంటుంది. నీటిలో కలుపుకొని తాగాలి. కరోనా రోగుల చికిత్సకు ఇది సురక్షితమని, రోగులు దవాఖానల్లో చేరే అవకాశాల్ని తగ్గిస్తుందని, ఆక్సిజన్‌పై ఆధారపడుతూ చికిత్స తీసుకోవడాన్ని మెరుగుపరుస్తుందని పరిశోధకులు తెలిపారు. ఈ ఔషధంలోని ఓ రకమైన సూడో గ్లూకోజ్‌ మాలిక్యూల్స్‌ వైరస్‌ తీవ్రతను తగ్గిస్తాయని వెల్లడించారు. 10వేల ప్యాకెట్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయని గురువారం రాజ్‌నాథ్ తెలిపారు. సాచెట్ ధరను రూ.990గా రెడ్డి ల్యాబ్స్ ఫిక్స్ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.