కేరళలో ఇంటర్‌ పరీక్షల్ని నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశం

కేరళలో రోజువారీగా నమోదవుతున్న కరోనా కేసుల దృష్ట్యా ఇంటర్‌ పరీక్షల్ని నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. కేరళలో సెప్టెంబరు 6వ తేదీ నుంచి ఇంటర్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ ప్రతిపాదనలో కేరళ హైకోర్టు జోక్యం చేసుకోకూడదనే నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్‌ జస్టిస్‌ ఎఎమ్‌ ఖాన్విల్కర్‌, జస్టిస్‌ హృషికేష్‌రారు, జస్టిస్‌ సిటి రవికుమార్‌ల ధర్మాసనం విచారణ జరిపింది. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 70 శాతం కేసులు కేరళలో నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. పరీక్షలు రాసే విద్యార్థులు కూడా 18 సంవత్సరాల లోపు వారే. ఈ వయసు పిల్లలకు వైరస్‌ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉండనప్పటికీ రోజువారీగా 30 వేలకు పైగా కేసులు నమోదవ్వడాన్ని పరిశీలించి.. పరీక్షలు నిలిపివేయాలని ధర్మాసనం పేర్కొంది. కేరళలో వైద్యపరమైన మౌలిక సదుపాయాలున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్‌ కేసుల్ని అదుపు చేయలేకపోయిందని జస్టిస్‌ రారు అన్నారు.
థర్డ్‌వేవ్‌లో చిన్నారులపై వైరస్‌ ప్రభావం ఎక్కువగా చూపనుందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ప్రభావాన్ని అంచనా వేసినప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం చిన్నారులకు వ్యాక్సిన్‌ వేయడం ప్రారంభించలేదు. 12-17 మధ్య వయసుగల చిన్నారులకు జైడస్‌ కాడిలా వ్యాక్సిన్‌ అక్టోబర్‌ నుంచి టీకా వేయడం జరుగుతుందని కోవిడ్‌ ప్యానెల్‌ చీఫ్‌ డాక్టర్‌ ఎన్‌కె అరోరా గత వారం వెల్లడించారు.