పంజ్‌షీర్‌ పై తాలిబన్ల గెలుపు!

అఫ్గనిస్తాన్‌ను తమ వశం చేసుకున్న తాలిబన్లు.. పంజ్‌షీర్‌ ప్రావిన్స్‌పై పట్టు సాధించేందుకు జరుగుతున్న పోరులోనూ పైచేయి సాధించారు. మొత్తం ప్రాంతమంతా వాళ్ల ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం అధికారికంగా తాలిబన్లు ఈ విషయాన్ని ప్రకటించుకున్నారు.

పంజ్‌షీర్‌ ప్రావిన్సియల్‌ గవర్నర్‌ కార్యాలయంపై తాలిబన్లు జెండా ఎగరవేశారు. పంజ్ షీర్ల శాంతి ప్రతిపాదనను తాలిబన్లు తిరస్కరించారు. పంజ్ షీర్ ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. పంజ్ షీర్ గవర్నర్ కార్యాలయంపై తాలిబన్లు తెలుపు జెండా ఎగరేసిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

అయితే తాలిబన్లను భారీ సంఖ్యలో మట్టుపెట్టామని పంజ్‌షీర్‌ యోధులు ప్రకటించిన రోజులోనే.. ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. అఫ్గనిస్తాన్‌లో చిట్టచివరి ప్రాంతాన్ని కైవసం చేసుకోవడంలో తాలిబన్లు సఫలమైనట్లు తాలిబన్‌ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ తెలిపాడు. కాగా, ఆగస్ట్ 15న అఫ్గాన్ ను తాలిబన్ల ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే.