ట్రంప్‌కు ట్విట్టర్ మరో షాక్.. మరో 70 వేల ఖాతాల సస్పెన్షన్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాలను బ్లాక్ చేసి విమర్శలపాలైన మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ తన దూకుడు కొనసాగిస్తోంది. ట్రంప్‌కు అనుకూలంగా ఉన్న మరో 70 వేల ఖాతాలను బ్లాక్ చేస్తున్నట్టు ప్రకటించి కలకలం రేపింది. కేపిటల్ భవనం వద్ద ఇటీవల జరిగిన ఘటనల నేపథ్యంలో హింసను ప్రేరేపించేలా ట్వీట్‌లు చేసిన వారి ఖాతాలను శాశ్వతంగా తొలగించే ప్రక్రియను ప్రారంభించినట్టు ట్విట్టర్ తెలిపింది. ఇలాంటి ఖాతాలను పూర్తిగా తొలగిస్తున్నట్టు పేర్కొన్న ట్విట్టర్.. మొత్తంగా 70 వేల ఖాతాలను మూసివేసినట్టు వివరించింది.

మరోవైపు, ఫేస్‌బుక్ కూడా ట్విట్టర్ బాటలోనే పయనిస్తోంది. ట్రంప్ అనుకూల పోస్టులపై కొరడా ఝళిపించేందుకు రెడీ అయింది. ట్రంప్ మద్దతుదారులు ట్రెండ్ చేస్తున్న ‘ఆమోదం ఆపండి’ ని తొలగించింది. నిబంధనలు ఉల్లంఘించేలా ఉన్న పోస్టులను తొలగిస్తామని స్పష్టం చేసింది. హింసను ప్రేరేపించేలా ఉన్న తప్పుడు సమాచారానికి అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫేస్‌బుక్ తెలిపింది.