కోర్టుల్లో 50% మహిళా రిజర్వేషన్‌ సాకారమవ్వాలి

”ప్రపంచ కార్మికులారా ఏకం కండి… (పోరాడితే) పోయేదేం లేదు… సంకెళ్లు తప్ప అని కార్ల్‌మార్క్స్‌ పిలుపునిచ్చారు. ఇప్పుడు దాన్ని కొంత మార్చి ప్రపంచ మహిళలారా ఏకం కండి… (పోరాడితే) పోయేదేమీలేదు సంకెళ్లు తప్ప అని చెబుతున్నా” అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు. మహిళలంతా గట్టిగా డిమాండ్‌ చేసి 50% రిజర్వేషన్లు సాధించుకోవాలని, అదేమీ ఎవరో ఇచ్చే దానం కాదు.. హక్కు అని స్పష్టంచేశారు. కొత్తగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపట్టిన 9 మంది న్యాయమూర్తుల కోసం సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదుల సంఘం ఆదివారం నిర్వహించిన సన్మాన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

ఆరోజు నేను ఎక్కడున్నా సంతోషిస్తాను

”ఎప్పుడోసారి మనం అన్ని కోర్టుల్లో 50% మహిళా రిజర్వేషన్ల లక్ష్యాన్ని సాకారం చేసుకుంటామని నమ్ముతున్నాను. ఆరోజు నేను ఎక్కడున్నా సంపూర్ణంగా సంతోషిస్తాను. దేశవ్యాప్తంగా కిందిస్థాయి న్యాయవ్యవస్థలో 30% లోపే మహిళా న్యాయాధికారులు ఉన్నారు. హైకోర్టుల్లో అది 11.5%కి పరిమితమైంది. సుప్రీంకోర్టులో ప్రస్తుత నలుగురు మహిళా న్యాయమూర్తులతో కలిపి 11-12% ప్రాతినిధ్యం లభించినట్లయింది. 17 లక్షల మంది న్యాయవాదుల్లో 15% మాత్రమే మహిళలున్నారు. బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాలో ఒక్క మహిళా సభ్యురాలికీ ప్రాతినిధ్యం లేకపోవడాన్ని ఆ సంస్థ ఛైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లాను.