ఆదర్శవంతమైన సమాజ నిర్మాణానికి భాష, సంస్కృతులే పునాది: వెంకయ్యనాయుడు

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యవహారిక భాషోద్యమ నేత గిడుగు రామ్మూర్తి పంతులుకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ”మన భాష- మన సమాజం- మన సంస్కృతి” పేరుతో దక్షిణాఫ్రికా తెలుగు సమాఖ్య అంతర్జాల సదస్సు నిర్వహించడం అభినందనీయని ట్వీట్‌ చేశారు. ప్రపంచం నలుమూలల నుంచి హాజరైన ఇతర సంస్థలను ఆయన అభినందించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి గిడుగు రామ్మూర్తి విజ్ఞానం అందరికీ అందాలనే సంకల్పంతో వ్యవహారిక భాషోద్యమానికి నాంది పలికారని కొనియాడారు. పుస్తకాల్లోనూ సులభమైన భాషను వాడాలని ఉద్యమించారని గుర్తుచేశారు. తద్వారా తెలుగు భాషాభివృద్ధిని కాంక్షించారన్నారు. మాతృభాషను కాపాడుకోవడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అన్నారు.

ఆదర్శవంతమైన సమాజ నిర్మాణానికి భాష, సంస్కృతులే పునాది అని వెంకయ్యనాయుడు అన్నారు. ప్రైవేటీకరణ నేపథ్యంలో పలు భాషలు అంతరించే ప్రమాదంలో పడ్డాయని పేర్కొన్న ఆయన.. వాటిని కాపాడుకోవాలని కోరారు. మాతృభాషకు ప్రాధాన్యం ఇస్తూనే ఫ్రాన్స్‌, జర్మనీ, స్వీడన్‌, రష్యా, జపాన్‌, ఇటలీ, బ్రెజిల్‌ దేశాల ఒరవడిని ఆదర్శంగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పురోభివృద్ధి కోరుకొనేవారు పూర్వ వృత్తాన్ని మరవకూడదన్న పెద్దల మాటను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మన కట్టు, బొట్టు, భాష, యాస, పండుగలు, పబ్బాలు.. ఇలా అన్నింటినీ గౌరవించుకొని మన సంస్కృతిని కాపాడుకోవాలని, ముందుతరాలకు అందించాలని కోరారు. భాష ద్వారా మంచి సంస్కృతి, తద్వారా ఆదర్శమంతమైన సమాజ నిర్మాణం దిశగా ప్రతిఒక్కరూ నడవాలని ఆకాంక్షిస్తున్నా” అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.