విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా..?: పాలవలస యశస్వి

●విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయాలి
●పిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా?
●స్పందించకపోతే, విద్యాసంస్థలను మూసేభాద్యత జనసేన తీసుకుంటుంది.

విజయనగరం, జిల్లాలో విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేసి, కరోనా బారినుంచి విద్యార్థులను, విద్యార్థుల తల్లిదండ్రులను, అధ్యాపకులను కాపాడాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం అసెంబ్లీ ఇంచార్జ్ పాలవలస యశస్వి సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి మరియు జిల్లా విద్యాధికారి అడిషనల్ డైరెక్టర్ లకు వినతిపత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలొనే కాకుండా రాష్ట్రంలో కూడా వేల సంఖ్యలో జనం కరోనా బారిన పడుతున్నారని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాల్సింది పోయి, మూర్ఖంగా ప్రవర్తిస్తుందని, సాధారణంగా పిల్లల్లో వ్యాధినిరోధక శక్తి తక్కువ ఉంటుందని, కనీసం పాఠశాలల్లో కరోనా నియమాలను పాటించట్లేదని, ఈ సమయంలో బడులు నిర్వహించడం పట్ల జనసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు. విద్యాసంస్థలను కొద్దిరోజులు మూసివేయ్యాలనే ప్రతిపాదనకు విద్యా శాఖ మంత్రి సురేష్ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే విద్యార్థుల ఆరోగ్యంపై ఎంత నిర్లక్యంగా వ్యవహరిస్తున్నారో అర్ధం అవుతుందని దుయ్యబట్టారు. నేటి బాలలే రేపటి పౌరులని వైస్సార్సీపీ నాయకులు సమావేశాల్లో మాట్లాడటమే తప్ప వారి ఆరోగ్యం కోసం పట్టించుకోవడం లేదని, బహుశా వారికి ఓటు హక్కు లేదని నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. అందుకనే కరోనా అదుపులోకి వచ్చే వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేసి కరోనా నుంచి విద్యార్థులను కాపాడాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుందని తెలిపారు. లేనిపక్షంలో పాఠశాలలు మూసే భాద్యతలు జనసేన పార్టీ తీసుకుంటుందని హెచ్చరించారు. ఆమెతో పాటుగా జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు), యర్నాగుల చక్రవర్తి, రాగోలు సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.