దుర్గమ్మ రథానికి అమర్చిన సింహం ప్రతిమలు అదృశ్యం

విజయవాడ దుర్గమ్మ దేవస్థానం వెండి రథానికి అమర్చిన ప్రతిమలు మాయమైన ఘటన వెలుగులోనికి వచ్చింది. అంతర్వేది ఘటన తర్వాత ఆలయాల్లో రథాల భద్రతపై ప్రభుత్వం ప్రత్యెక శ్రద్ద సారించింది. ఈ నేపథ్యంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఆలయ సిబ్బంది మాత్రం అధికారికంగా దీనిని ధ్రువీకరించడం లేదు.

ఈవో ఏమంటున్నారంటే? అంతర్వేది ఘటన తర్వాత రథాల పరిశీలన, భద్రత అంశాలపై వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ప్రాంగణంలో దేవాదాయశాఖ అధికారులతో 13న పశ్చిమ ఏసీపీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో వెండి రథాన్ని దేవస్థానం అధికారులు పరిశీలించారు. అప్పుడే సింహాల ప్రతిమలు కనపడలేదన్న విషయాన్ని గుర్తించారని సమాచారం. గత ఏడాది ఉగాది రోజున స్వామి వార్ల ఉత్సవమూర్తులను ఈ వెండి రథంపై ఊరేగించారు. ఈ ఏడాది కొవిడ్‌ దృష్ట్యా దేవస్థానం ఊరేగింపును రద్దు చేసింది. అప్పటి నుంచి ఆ రథానికి ముసుగు వేసి ఉంచారు. ఇటీవలి కాలం వరకూ తీయలేదు. దీనిపై దుర్గగుడి ఈవో సురేష్‌బాబు మీడియాతో మాట్లాడుతూ… ‘గత 18 నెలలుగా వెండి రథం మల్లికార్జున మహామండపంలో ఉంది. దానికి ఎన్ని సింహాలు ఉన్నాయో? వాటిని మరమ్మతులకు ఇచ్చారా? లాకరులో ఉన్నాయా? అన్నది పరిశీలన తర్వాతే స్పష్టమవుతుంది. దేవస్థానంలో ఉన్న వెండి, బంగారు వస్తువులు, వాహనాలకు బీమా సౌకర్యం ఉంది. పూర్తి స్థాయి పరిశీలన చేసిన తర్వాతే ఫిర్యాదు చేయాలా? వద్దా? అన్న విషయాన్ని నిర్ణయిస్తాం’ అని స్పష్టం చేశారు.

ఈ ఘటనపై స్పందిoచిన తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విజయవాడ కనకదుర్గమ్మ వెండిరథానికి ఉండే నాలుగు సింహాల్లో మూడు ప్రతిమల చోరీకి గురయ్యాయని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. అధికారులు ఎవరిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. సీఎం జగన్‌ అండ చూసుకుని అరాచక శక్తులు పేట్రేగిపోతున్నాయని ఆరోపించారు.