పోలీసుల నిర్బందంలో ఏపీ బీజేపీ చీఫ్

ఏపీ బీజేపీ రేపు నిర్వహించతలపెట్టిన ‘చలో అమలాపురం’ కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ నేపధ్యం లో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఛలో అమలాపురం నిర్వహిస్తున్నట్లు సోము వీర్రాజు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బయలుదేరేందుకు సిద్ధమైన సోము వీర్రాజును పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను విజయవాడలో అరెస్ట్ చేశారు. అమలాపురం పార్లమెంట్ పరిధిలో సెక్షన్ 30, 144 అమల్లో ఉన్నందున సోము వీర్రాజును ముందస్తు అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఛలో అమలాపురం కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించలేదని సోము వీర్రాజు తెలిపారు.

గ్రామ వాలంటీర్ల ద్వారా బీజేపీ కార్యకర్తల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోందని తెలిపారు. అందువల్ల ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్యకంగా తీసుకున్నామని వీర్రాజు తెలిపారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా ఐదు పార్లమెంటు నియోజక వర్గాలకు చెందిన బీజేపీ కార్యకర్తలు ఛలో అమలాపురం కార్యక్రమంలో పాల్గొంటారని వీర్రాజు ప్రకటించారు. ఇక ఛలో అమలాపురం కార్యక్రమానికి హాజరయ్యేందుకు సిద్ధమైన బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజును కూడా పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అంతర్వేది సందర్శనకు వెళ్తామని ప్రకటించిన నేపథ్యంలో ముందస్తుగా నోటీసు ఇచ్చి పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు.