రైతులకు లాభసాటి ధర సాధనే జనసేన లక్ష్యం

రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కాదు లాభసాటి ధర రావాలన్నదే జనసేన పార్టీ లక్ష్యమని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. అందుకు పార్టీ తరపున “జై కిసాన్” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. రకరకాల వ్యవసాయ సంఘాలు, శాస్త్రవేత్తలతో చర్చించి, సంప్రదింపులు జరిపి కార్యక్రమాన్ని రూపొందిస్తామని వెల్లడించారు. నివర్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన నేపథ్యంలో గురువారం సాయంత్రం తిరుపతిలోని మీడియా ప్రతినిధులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “తిరుపతికి వచ్చే ముందే రెండు తుపాన్లు రాబోతున్నాయని సమాచారం ఉన్నా… నష్టపోయిన రైతుకు భరోసా కల్పించేందుకు పర్యటన చేయాలని నిర్ణయించుకున్నాం. క్షేత్ర స్థాయిలో పర్యటించిన అనంతరం, మా జిల్లా స్థాయి నాయకులతో కూడా పర్యటనలు జరిపి పంట నష్టంపై నివేదిక తయారు చేస్తాం. ఆ నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించడంతో పాటు ప్రజలకు తెలియజేస్తాం.