హత్రాస్ కుటుంబంతో ప్రభుత్వం ప్రవర్తన సరికాదు

హత్రాస్ ఘటన చాలా బాధాకరమైనదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. బాధిత కుటుంబంతో ప్రభుత్వం ప్రవర్తించిన తీరు సరికాదని ఆయన అన్నారు. మనం ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నామని ఆయన చెప్పారు. అధికారంలో ఉన్న వారు యజమానులు కాదని, ఈ దేశానికి ‘సేవకులు’ అన్నది మర్చిపోకూడదని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. హత్రాస్‌కు చెందిన 19 ఏండ్ల దళిత యువతిపై సెప్టెంబర్ 14న సామూహిక లైంగికదాడి జరుగగా ఢిల్లీ దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.

అయితే యువతి మృతదేహానికి అర్థరాత్రి వేళ కుటుంబ సభ్యులకు చెప్పకుండా పోలీసులు దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించడం, లైంగిక దాడి జరిగిందన్న ప్రాంతానికి మీడియాతోపాటు ఎవరినీ అనుమతించకపోవడం, ఆ యువతిపై లైంగికదాడి జరుగలేదని పోలీసు అధికారులు చెప్పడం, బాధిత కుటుంబాన్ని అధికారులు బెదిరించడం, వారిని ఎవరూ కలువకుండా అడ్డుకోవడం వంటి పరిణామాలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం స్పందించారు. బాధిత కుటుంబంతో యూపీ ప్రభుత్వం ప్రవర్తన సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.