కేంద్రంతో చర్చలకు అంగీకరించిన రైతు సంఘాలు

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు వ్యక్తం చేస్తున్న రైతు సంఘాలు కేంద్రంతో చర్చలకు అంగీకరించాయి. ఈ నెల 29న (మంగళవారం) ఉదయం 11గంటలకు చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని 40 రైతు సంఘాల తరఫున కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్‌ అగర్వాల్‌కు లేఖ రాశారు. ఈ రోజు మధ్యాహ్నం 2గంటలకు సమావేశమైన రైతు నేతలు కేంద్రం నుంచి వచ్చిన ప్రతిపాదనలు, తాజా లేఖపై చర్చించినట్టు తెలుస్తోంది. అన్ని అంశాలను కూలంకుషంగా చర్చించేందుకు రైతు సంఘాలు ఎప్పుడూ చర్చలకు సిద్ధంగానే ఉన్నాయని రైతు నేతలు పేర్కొన్నారు.

ముఖ్యంగా మూడు వ్యవసాయ చట్టాలు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ ఇవ్వడం, పంట వ్యర్థాలు తగులబెట్టే విషయంలో నమోదుచేసిన కేసులు, విద్యుత్‌ ముసాయిదా బిల్లు-2020లో మార్పులు చేర్పులు తదితర అంశాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తే మంగళవారం ఉదయం చర్చలకు వస్తామని స్పష్టంచేశారు. రైతులపై కేసుల విషయంలో కేంద్రం ఆలోచించాలని సూచించారు. కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్‌ ముసాయిదా బిల్లులో రైతుల ప్రయోజనాలను పరిరక్షించేలా మార్పులు చేయాలన్నారు. రైతు సంఘాల నేతలు రాసిన లేఖపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.