కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. పండగకు పదివేలు

కరోనా సంక్షోభం దెబ్బతో దేశ ఆర్థిక వ్యవస్థ భారీగా దెబ్బ తిన్నది. ముఖ్యంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. అలాగే ఉపాధి లేకుండా పోయింది. పెద్ద పెద్ద కంపెనీలు సైతం తమ ఉద్యోగుల వేతనాలకు కోత పెట్టాయి. అయితే ఇలాంటి విపత్కర సమయంలోనూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పండుగ సీజన్లో  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించింది.

మోదీ ప్రభుత్వం ఉద్యోగులకు పండుగ ఆఫర్ ఇస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి నేపధ్యంలో మందగించిన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు పలు స్కీమ్ లు ప్రవేశపెట్టింది. ఎల్‌టీసీ క్యాష్ వోచర్ , స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ లను ప్రవేశపెడుతున్నట్టు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కరోనా వైరస్ మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని, పేద-బలహీన వర్గాల కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రకటించిందని, కొంత వరకు కష్టాలు తీరినా.. వినియోగదారుడికి మరింత బూస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. కస్టమర్లు తమ ఖర్చును పెంచే విధంగా కొన్ని ప్రతిపాదనలను డిజైన్ చేసినట్లు మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

వినియోగదారుడి ఖర్చుకు సంబంధించి ఎల్‌టీసీ క్యాష్ వోచర్‌, స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ పథకాలను మంత్రి ప్రకటించారు. ట్రావెల్ క్యాష్ వోచర్లతో ఉద్యోగులు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ చేసుకోవచ్చని, మూడింతలు టికెట్ ధర కూడా తీసుకోవచ్చని చెప్పారు. ఈ ఎన్‌క్యాష్‌మెంట్‌తో 12 శాతం జీఎస్టీ ఉండే వస్తువులను కొనుగోలు చేయవచ్చన్నారు. ఇందులో భాగంగా కేవలం డిజిటల్ లావాదేవీలకు మాత్రమే వీటిని వర్తింపజేయనున్నారు. ఈ పధకాల కోసం ప్రభుత్వానికి 5 వేల 675 కోట్లు ఖర్చు కానుంది. పీఎస్‌బీ, పీఎస్‌యూలకు 19 వందల కోట్లు ఖర్చు అవనుంది.

నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు మాత్రం స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్‌ను అమలు చేయనున్నారు. ఈ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వడ్డీ లేకుండా పది వేల వరకూ రుణం ఇవ్వనున్నారు. ప్రీపెయిడ్ రూపేకార్డు రూపంలో ఈ నగదు చెల్లిస్తారు. ఈ స్కీమ్ ద్వారా ప్రభుత్వంపై దాదాపు 4 వేల కోట్లు భారం పడనుంది. ఇదే స్కీమ్‌ను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తే అదనంగా మరో 8 వేల కోట్లు పంపిణీ చేయాల్సి ఉంటుంది.