అన్ ఎయిడెడ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి: వై. శ్రీనివాస్

*పాలకమండలి నిర్లక్ష్యంతో రోడ్డున పడ్డ ఉద్యోగులు

*వేలకోట్ల ఆస్తులు ఉన్నా అభివృద్ధికి నోచుకోని విద్యా సంస్థలు

*జనసేన పార్టీ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై. శ్రీనివాస్

రాజమహేంద్రవరం : ఎస్.కె.వి.టి పాఠశాల నందు పనిచేస్తున్న అన్ ఎయిడెడ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించకపోతే ఉద్యమం చేస్తామని జనసేన పార్టీ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై. శ్రీనివాస్ తెలిపారు. విధులనుండి తొలగించబడిన స్కూల్ సిబ్బంది తెలుపుతున్న నిరసనకు జనసేన పార్టీ తరపున వై. శ్రీనివాస్ మద్దతు ప్రకటించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ సేవకు తన యవదాస్తిని అంకిత మిచ్చిన సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం స్థాపించిన వి.టి మరియు ఎస్.కె.వి.టి హైస్కూల్ నందు గత 30 సంవత్సరాలుగా అంకితభావంతో పనిచేసిన అన్ ఎయిడెడ్ సిబ్బంది ఉద్యోగాలు తొలగించడం అన్యాయం అన్నారు. హితకారిణి సమాజం పరిధిలోని విద్యాసంస్థలన్నిటిని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రతిపాదనలో భాగంగా ఎయిడెడ్ మరియు అన్ ఎయిడెడ్ సిబ్బందిని కలుపుకుని ఆస్తులతో సహా ప్రభుత్వ పరం చేస్తే ఇన్నేళ్లుగా సంస్థలో పనిచేసిన వారికి న్యాయం జరుగుతుందనే భావంతోనే ఈ ప్రతిపాదన సిబ్బంది వ్యతిరేకించలేదని తెలిపారు. అయితే దీనికి విరుద్ధంగా కాలేజీలో పనిచేసే అన్ ఎయిడెడ్ సిబ్బందిని గుర్తించి స్కూల్ సిబ్బందిని విస్మరించడం తగదన్నారు. ఆస్తులతో సహా ప్రభుత్వ పరం చేయడానికి సిద్దమైన విద్యాసంస్థలలోని అన్ ఎయిడెడ్ సిబ్బందితో సహా ప్రభుత్వానికి అప్పగించే ప్రతిపాదనలు ఉన్నప్పటికీ హితకారిణి సమాజం చైర్మన్ మరియు సహాయ కమిషనర్ ప్రభుత్వానికి సరైన సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. వేలకోట్ల విలువ చేసే ఆస్తులు ఉండి కూడా అభివృద్ధి చేతకాదంటూ ప్రభుత్వంలో విలీనానికి ఎందుకు సిద్ధపడ్డారో స్థానిక అధికార పక్ష నాయకులకే తెలియాలన్నారు. సంఘసంస్కరణ కోసం, విద్యావ్యాప్తి కోసం కందుకూరు వీరేశలింగం తన యావదాస్తిని దానం చేస్తే కనీసం ఆ విద్యా సంస్థల పట్ల స్థానిక నాయకులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. తరగతి గదులు కూడా సరిగా లేని కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు రకరకాలుగా కోర్సులతో సంపదను సృష్టించుకుంటే అన్ని వసతులతో భవన సముదాయాలు ఉన్నప్పటికీ విద్యాసంస్థలను జీతాలు కూడా ఇవ్వలేని దీన స్థితికి తీసుకువచ్చారన్నారు. నిధులు సమకూర్చలేక ఫిక్స్ డిపాజిట్లను రద్దుచేసి స్కూల్ సిబ్బందికి గత కొన్ని నెలలుగా బకాయి ఉన్న జీతాలు చెల్లిస్తామని హామీ ఇవ్వడం పాలకమండలి చేతకానితనానికి నిదర్శనం అన్నారు. ఆస్తుల పరిరక్షణ, కళాశాలల అభివృద్ధికి కృషి చేస్తామని గొప్పలు చెప్పిన పాలకమండలి సభ్యులు ప్రమాణం స్వీకారం చేసి ఆరు నెలలైనా చేసిందేమీ లేదన్నారు. రాజమహేంద్రవరం చరిత్ర ఉన్నంతకాలం యుగపురుషుడు కందుకూరి వీరేశలింగం చరిత్ర ఉంటుందని అటువంటి మహానుభావుడు ఆశయానికి తూట్లు పొడిచే ప్రయత్నం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విధుల నుండి తొలగించిన అన్ ఎయిడెడ్ సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని హితకారిణి సమాజం సహాయ కమీషనర్ ని కోరామని ఆమె సానుకూలంగా స్పందించారని తెలిపారు. కందుకూరి విద్యాసంస్థలను ప్రభుత్వం పరం చేసే పక్షంలో ఖచ్చితంగా అందులో పని చేస్తున్న అన్ ఎయిడెడ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని లేనిపక్షంలో జనసేన పార్టీ ఉద్యమాన్ని చేపడుతుందని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ వైస్ చైర్మన్ ఏ.వి.ఎన్.ఎస్ రామచంద్రరావు, పార్టీ జిల్లా కార్యదర్శి జామి సత్యనారాయణ, నగర కార్యదర్శి షేక్ భాషా లిమ్రా పాల్గొన్నారు.