శివాత్మిక ఎమోషనల్ పోస్ట్.. అవాస్తవాలను ప్రచారం చేయకండి

ఇటీవల యంగ్రీయంగ్ మెన్ డా. రాజశేఖర్ ఫ్యామిలీ కరోనావైరస్ సోకినట్టు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ట్విట్టర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. తనతో పాటు భార్య జీవిత.. పిల్లలు శివాని.. శివాత్మిక కరోనా బారిన పడ్డామని అయితే కోవిడ్ నుంచి శివాని .. శివాత్మిక కోలుకున్నారని రాజశేఖర్ స్పష్టం చేశారు.

తాజాగా ఆయన కుమార్తె శివాత్మిక సోషల్మీడియా ట్విట్టర్ వేదికగా పెట్టిన పోస్ట్ ఆందోళన కలిగిస్తోంది. ‘ప్రియమైన అందరికి కరోనాతో పోరాటం చేయటంలో నాన్న ఇబ్బంది పడుతున్నారు. మీ అందరి అభిమానంతో ఆయన క్షేమంగా తిరిగి వస్తారని ఆశిస్తున్నాను. నాన్న త్వరగా కోలుకోవాలంటూ ప్రార్ధనలు చేయండి’ మీ ప్రార్థనలు ప్రేమే మమ్మల్ని కాపాడాయని మేము నమ్ముతున్నాము. మీ ప్రేమాభిమానాలతో నాన్న బలంగా తిరిగి బయటకు వస్తాడు` అని శివాత్మిక పెట్టిన పోస్ట్ పలువురిని భావోద్వేగానికి గురిచేసింది.

కాగా, ఆమె చేసిన ట్వీట్‌ చూసి నెటిజన్లు కంగారుపడ్డారు. దీంతో ఆమె వెంటనే మరో ట్వీట్‌ చేశారు.. ‘మీరు చేస్తున్న ప్రార్థనలకు ఎలా కృతజ్ఞతలు తెలియజేయాలో నాకు అర్థం కావడం లేదు. ఆయన ఆరోగ్యపరిస్థితి విషమంగా లేదు. స్థిరంగా ఉంది. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. మీ ప్రార్థనలు మాకు కావాలి. థ్యాంక్యూ. భయపడకండి. అవాస్తవాలను ప్రచారం చేయకండి’ అని పేర్కొన్నారు.