రైతుల నిరసనలో పాల్గొన్న ఇండియన్‌ క్రికెటర్‌

కేంద్రం అమలులోకి తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌, హర్యానా రైతులు 14 రోజులుగా చేస్తున్న నిరసనలో ఓ ఇండియన్ క్రికెటర్ పాల్గొన్నాడు. చాలా మంది స్పోర్ట్స్ స్టార్లు ఈ నిరసనలకు మద్దతు తెలుపుతుండగా.. పంజాబ్ రంజీ టీమ్ కెప్టెన్‌, ఐపీఎల్‌లో కింగ్స్ పంజాబ్ ప్లేయర్ అయిన మణ్‌దీప్ సింగ్ మాత్రం.. నేరుగా వెళ్లి వాళ్లతో కలిసి ఆందోళన నిర్వహించడం విశేషం. ఇలా రైతుల నిరసనలో పాల్గొన్న తొలి ఇండియన్ క్రికెటర్‌గా మణ్‌దీప్ నిలిచాడు. వణికించే చలిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులకు తన మద్దతు తెలపాలన్న ఉద్దేశంతోనే తాను వెళ్లినట్లు మణ్‌దీప్ చెప్పాడు. సింఘు సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతుల దగ్గరకు మణ్‌దీప్ వెళ్లి వాళ్లతో కలిసి నిరసనలో కూర్చున్నాడు. తన తండ్రి ఉండి ఉంటే.. ఆయన కూడా ఈ ఆందోళనలకు మద్దతు ఇచ్చే వారని మణ్‌దీప్ సింగ్ తెలిపాడు.