కరోనాతో ఆరోగ్యం విషమించిన ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్

డిసెంబరు 18న కరోనా వైరస్ బారిన పడిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఆరోగ్యం విషమించింది. ఆయనను అత్యవసర చికిత్స నిమిత్తం డూస్ ఆసుపత్రికి తరలించారు. ఆయన ప్రస్తుతం జ్వరం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారని వైద్యాధికారులు వెల్లడించారు. డూన్ ఆసుపత్రి వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో రావత్‌కు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ముఖ్యమంత్రి రావత్, అతని భార్య, కుమార్తెలకు డిసెంబరు 18న కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో ఆయన కుటుంబసభ్యులు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి స్వయంగా తెలియజేశారు. ఇదిలావుంటే, ఉత్తరాఖండ్ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. ప్రతి ఒక్కరూ బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించాలని, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం తప్పనిసరి అని ప్రచారం చేస్తోంది.