వైష్ణో దేవి ఆలయం చెంత కురుస్తున్న హిమపాతం

జమ్మూలోని వైష్ణోదేవి ఆలయ పరిసరాల్లో మంచు వర్షం కురుస్తోంది. కురుస్తున్న హిమపాతం అద్భుతమైన దృశ్యంలా మారింది. ఆలయం పైన, చుట్టుపక్కలా ఎక్కడ చూసినా మంచే. రాత్రిపూట.. విద్యుత్ దీపాల వెలుగుల్లో.. హిమపాతం కనువిందు చేస్తోంది. వైష్ణోదేవి ఆలయం, పరిసర ప్రాంతాలన్నీ మంచుతో నిండిపోయాయి. రాత్రి వేళ.. కరెంటు లైట్లు వెలుగుతుంటే… ఆ సమయంలో పడిన మంచు వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. జమ్ముకాశ్మీర్‌లోని కత్రాలో వైష్ణోదేవి ఆలయం ఉంది. హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఈ సీజన్‌లో మంచు బాగా పడుతుంది. నదులన్నీ గడ్డ కట్టేస్తాయి. రోడ్లన్నీ మంచుతో నిండిపోతాయి. కత్రాలో ఈ సీజన్‌లో తొలి మంచు ఇదే.

అమ్మవారి భక్తులు, పర్యాటకులు ఎంతో ఆనందపడుతున్నారు. తాము దర్శనానికి వచ్చినప్పుడే మంచు కురవడం మంచి ముహూర్తం అని భావిస్తున్నారు.

కోవిడ్ కారణంగా దాదాపు ఆరు నెలలు మూతబడిన మాతా వైష్ణోదేవి ఆలయాన్ని ఆగస్టులో తెరిచారు. రోజుకు 7 వేల మంది భక్తులను అనుమతించేవారు. కోవిడ్ ప్రభావం తగ్గడంతో రోజుకు 15వేల మంది భక్తులను దర్శనానికి అనుమతినిస్తున్నారు అధికారులు. ఇప్పుడీ హిమపాతంతో అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు, పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.