రైతులను మరోమారు చర్చలకు ఆహ్వానించిన కేంద్రం..

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీ సరిహద్దులలో రైతుల పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. తమ డిమాండ్ల విషయంలో రైతులు ఏ మాత్రం తగ్గకుండా పోరాటం సాగిస్తున్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తేనే వెనుదిరిగి వెళ్తాం అంటూ పదే పదే రైతులు ప్రభుత్వానికి తేల్చి చెబుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు కేంద్రంతో ఐదు దఫాలుగా చర్చలు జరిగినా చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఇక ఇటీవల కేంద్రం పంపిన ఆహ్వానం మేరకు రైతులు రేపు ఉదయం 11 గంటలకు చర్చలకు సిద్ధం కాగా, ప్రభుత్వం వారిని 30వ తేదీన బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు చర్చలకు రావలసిందిగా ఆహ్వానించింది. రైతులతో చర్చలపై ఓపెన్ మైండ్ తో ఉన్నామని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ప్రభుత్వం ఉందని పేర్కొంది. ఈ మేరకు రైతు సంఘాలతో ఈనెల 30న మధ్యాహ్నం 2 గంటలకు చర్చలు ప్రారంభం కానున్నాయి.

ఇప్పటికే ఐదు మార్లు రైతులతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కాగా, తాజాగా మళ్లీ డిసెంబర్ 30వ తేదీన చర్చలు జరగనున్న నేపథ్యంలో, ఈసారైనా చర్చల్లో పురోగతి కనిపిస్తుందా అన్నది అంతుచిక్కని ప్రశ్నగా ఉంది.

కాగా, మూడు వ్యవసాయ చట్టాలను తొలగించే అంశం, కనీస మద్దతు ధరకు చట్టబద్దమైన హామీ ఇవ్వడం, పంట వ్యర్థాలు తగులబెట్టిన విషయంలో నమోదు చేసిన కేసులను ఎత్తివేయడం, విద్యుత్‌ ముసాయాదా బిల్లు -2020లో మార్పులు తదితర అంశాలను ఎజెండాలో తప్పనిసరిగా చేర్చాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తే మళ్లీ చర్చలకు వస్తామని రైతు సంఘాలు తెలిపాయి. మరి ఈ చర్చల్లో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.