ఇకపై సోషల్ డిస్టెన్సింగ్ కు కావల్సింది 16 అడుగుల దూరo

కరోనా వైరస్ లక్షణాలు  గానీ…విస్తరణ అంతకంతకూ మార్పు చెందడం భయభ్రాంతులకు గురి చేస్తోంది. కరోనా వైరస్ రూపాన్నే కాదు లక్షణాన్ని  కూడా మార్చుకుంటోంది. ఇప్పుడు కొత్తగా 16 అడుగుల దూరంలో కూడా గాలిలోంచి వైరస్ వ్యాప్తి చెందుతున్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి.

ప్రారంభంలో శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలుగా చెప్పిన వైద్యులు తరువాత రుచి పసిగట్టలేకపోవడం, వాసన లేకపోవడమనే లక్షణాల్ని చేర్చారు. ఆ తరువాత కళ్లు ఎర్రబడతాయనే మరో లక్షణాన్ని చేర్చారు. ఇప్పుడు ఆ వైరస్ విస్తరణ క్రమంపై కొత్త అంశాన్ని జోడిస్తున్నారు. ఈ లక్షణం ప్రకారం ఇప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ కు కావల్సింది ఆరడుగులు కాదు ఇకపై పదహారడుగులు అంటున్నారు వైద్య నిపుణులు.

అమెరికాలోని  ఫ్లోరిడా యూనివర్శిటీ కు చెందిన వైరాలజీ నిపుణులు 16 అడుగుల దూరంలో ఉన్నా సరే వైరస్ సోకుతుందని స్పష్టం చేస్తున్నారు. గాలిలో తేలే శ్వాసకోశ బిందువుల్లో కరోనా వైరస్ ఉందని నిరూపించినట్టు పరిశోధకులు చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా హెల్త్ షాండ్స్ లోని కోవిడ్ 19 వార్డు లో కొంతమంది రోగుల్ని 7-16 అడుగుల దూరంలో ఉంచి పరీక్షించారు. ఈ క్రమంలో ఏరోసోల్స్ నుంచి ప్రత్యక్షంగా వైరస్ ను వేరు చేయగలిగారు. అంటే సామాజిక దూరం మార్గదర్శకాల్లో సిఫారసు చేసిన దూరం ఆరడుగుల కంటే ఎక్కువ దూరం పాటించినా…వైరస్ వ్యాప్తి చెందడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పుడీక మార్గదర్శకాల్ని మార్చాల్సిన అవసరముందని ఫ్లోరిడా వైరాలజీ నిపుణులు చెబుతున్నారు. గది లోపలి వాతావరణంలో 7-16 అడుగుల దూరం వరకూ గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందవచ్చని న్యూయార్క్ లోని కొలంబియా యూనివర్శిటీ  వైరాలజిస్ట్ ఇప్పటికే స్పష్టం చేసారు. అందుకే వ్యాక్సిన్ లేదా అందుబాటులో వచ్చేంత వరకూ…తరచూ చేతుల్ని శుభ్రపర్చుకోవడం, ముఖానికి మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నియమాల్ని మరింత పకడ్బందీగా అమలు చేయాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు.